వైసీపీలో మరో చీలిక తప్పదా? ఇప్పటికే కడప ఎంపీ సీటు వైఎస్ ఫ్యామిలీని రెండు ముక్కలుగా చేసింది. ఇప్పుడు అదే ఎంపీ సీటు మూడు ముక్కలుగా చేయబోతుందా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది.
జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, కడప ఎంపీగా పోటీ చేస్తారని కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు జగన్ కానీ, వైసీపీ వర్గాలు కానీ క్లారిటీ ఇవ్వకపోవడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోంది. అయితే, కడప ఎంపీగా పోటీకి జగన్ సిద్దపడితే , ఆ పదవిలో ప్రస్తుతం కొనసాగుతోన్న అవినాష్ రెడ్డి రాజీనామా చేసేందుకు అంగీకరిస్తారా..? అన్నది వైసీపీ వర్గాల సందేహం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కడప ఎంపీ సీటు తనకు రక్షణ కవచమని వైఎస్ అవినాష్ రెడ్డి బలంగా భావిస్తున్నారు. జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం చేజారడంతో అక్రమాస్తుల కేసు జగన్ ను తీవ్రంగా భయపెట్టిస్తోంది. అందుకే ఈ కేసుల్లో కేంద్రాన్ని మేనేజ్ చేసేందుకు పార్లమెంట్ కు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
మరోవైపు, వివేకానంద హత్యకేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే బెయిల్ పైనున్న అవినాష్ రెడ్డి ఎంపీ పదవిని కూడా కోల్పోతే మరిన్ని చిక్కులు ఎదురు అవుతాయని భావిస్తూ ఉండొచ్చు. గత ఏడాది సీబీఐ అరెస్టు చేసిన సమయంలో తాను ఎంపీగా ఉన్నానని, ప్రజల సమస్యల కోసం పోరాడాల్సి ఉందని బెయిల్ తెచ్చుకున్నారు.ఇప్పుడు జగన్ రెడ్డి ఆదేశాల మేరకు పదవిని వదిలేసుకుంటే రేపు పరిస్థితి ఏంటి అని అవినాష్ రెడ్డి ప్రశ్నించే అవకాశం లేకపోలేదు.
కడప ఎంపీగా పోటీ చేయాలని జగన్ నిర్ణయించుకుంటే, అవినాష్ రెడ్డి తన అవసరాల దృష్ట్యా జగన్ ను ఎదురించినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే వైఎస్ ఫ్యామిలీ మూడు ముక్కలు కానుంది అనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి.