ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఐదు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకుండా మూడు నెలలపాటు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని సర్కార్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు మాత్రమే అవుతుండటంతో..వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై మంత్రులకు పూర్తి స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది. దీంతో ఇప్పటికప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి బదులుగా తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెడితే ఎలా ఉంటుంది..? అనే అంశంపై ఆర్థిక శాఖ సమాలోచనలు జరుపుతోంది.
ప్రస్తుత ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని సర్కార్ యోచిస్తునట్లుగా తెలుస్తోంది. కేంద్రం కూడా ఈ నెల మూడో వారంలో బడ్జెట్ ప్రవేశపెడుతుందని, కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు..వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని పూర్తి స్థాయి బడ్జెట్ ను మరో మూడు నెలల తర్వాత ప్రవేశపెట్టాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు సమాచారం.
ఈ నెల 16న జరిగే కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, బడ్జెట్ పై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది.