ఏపీలో జగన్ ఘోర ఓటమిపై మాజీ మంత్రి కేటీఆర్ తొలిసారిగా నోరు విప్పారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్న కేటీఆర్, హరీష్ రావులు మీడియాతో చిట్ చాట్ సమయంలో ఏపీలో జగన్ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అన్ని మంచి పథకాలు పెట్టిన జగన్ ఓటమి తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని… ఓడిపోయినా, వైసీపీ 40శాతం ఓట్లు సాధించటం మాములు విషయం కాదన్నారు. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు ఇంకోలా ఉండేవని… ప్రతిరోజు ప్రజల్లో ఉన్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓడిపోవటం ఏమిటంటూ కామెంట్ చేశారు.
అంతేకాదు జగన్ ఓడించాలన్న వ్యూహాంలో షర్మిలను ఓ పావుగా వాడుకున్నారని… ఆమె వల్ల ఏమీ కాదంటూ వైసీపీ నాయకుడి తరహాలో కామెంట్ చేశారు.
ఇటు తెలంగాణలో ఓటమిపై కామెంట్ చేస్తూ ప్రజలది తప్పు అనటం మాదే తప్పని, ప్రజలతో మాకు గ్యాప్ వచ్చిన మాట నిజమేనని… ఫలితాల తర్వాత అర్థమైందన్నారు.
ఇక తెలంగాణలో ఓటమి, ఫిరాయింపులపై హరీష్ రావు స్పందిస్తూ… గతంలో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు ఓడిపోయారని, ఇప్పుడు కాంగ్రెస్ కు అదే వర్తిస్తుందని, ఫిరాయింపు ఎమ్మెల్యేల వల్ల నష్టమే తప్పా లాభం లేదన్నారు.