టీడీపీ ఇంకా కుంభకోణాల వరకూ వెళ్లలేదు. సీసీ కెమెరా సాక్ష్యాలతో సహా దొరికిపోయిన దాడులు, దౌర్జన్యాల కేసులను మాత్రమే స్టార్టర్ గా తీసుకుంది అయితే వీటిలోనే తమను అరెస్టు చేసేస్తారన్న భయంతో కీలక నేతలు అంతా కోర్టులకు పరుగులు పెడుతున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అభ్యర్థిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ ఆఫీసుపై దాడి వ్యవహారంలో కీలక నిందితులుగా భావిస్తున్న వారంతా తమకు ముందస్తు బెయిల్ కావాలంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
ఇప్పటి వరకూ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, జోగి రమేష్ వంటి వారు ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వేశారు. మిగతా వారి సంగతేమో కానీ.. సజ్జల కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఆయన పేరు ఎక్కడా బయటకు రాలేదు.
కానీ టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో ప్రభుత్వం సిట్ ను నియమించింది. ఆ సిట్ విచారణలో టీడీపీ ఆఫీసుపై దాడికి ప్లాన్ సజ్జల దగ్గర నుంచే ప్రారంభమయిందని తేలింది. ఆయనే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారని ఆయన కనుసన్నల్లోనే దాడి జరిగిందని.. పోలీసులు ఎవరూ ఆ వైపునకు వెళ్లకుండా ఆయనే నియంత్రించారని గుర్తించారని అంటున్నారు. ఈ విషయం ఆయనకు తెలియడంతో అర్థరాత్రి వచ్చి ఎత్తేస్తారన్న భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో లేళ్ల అప్పిరెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.