కథలెందుకు చదవాలి?
– ఈ ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. అది కాలక్షేపపు ప్రక్రియ ఏమాత్రం కాదు. సమాజాన్ని, మనుషుల్ని, మనస్తత్వాల్ని, మన కన్ను సరిగ్గా చూడని సంగతుల్ని, మన మనసులు ఇంకా కనిపెట్టలేని విషయాల్ని రెండు, మూడు పేజీల్లో ఆవిష్కరించే అద్భుతమైన వేదిక.. కథ. అయితే అలాంటి కథలు వస్తున్నాయా, రాస్తున్నారా? అనేదే పెద్ద ప్రశ్న. కాకపోతే ఓ మంచి కథ వచ్చినప్పుడు తప్పకుండా పాఠకులకు పరిచయం చేయాల్సిందే అనే సంకల్పంతో, కథలు రాస్తున్నవాళ్లకు నాలుగు ప్రోత్సాహపు మాటలు అందివ్వాలన్న ఆశయంతో ‘కథాకమామిషు’ ప్రారంభమైంది. ఈ ప్రయాణంలో మరోవారం (జులై 7) పలకరించింది. ఈ వారం రెండు మంచి కథలు చదివే అవకాశం పాఠకులకు దక్కింది. సాక్షిలో ప్రచురితమైన ‘అద్వైత’, ఆంధ్రజ్యోతి కోసం అఫ్సర్ రాసిన ‘డియర్ మేరీ’ మెరిశాయి. వాటితో పాటు మిగిలిన పత్రికల్లో వచ్చిన కథలకు సంబంధించిన పరిచయం టూకీగా.
కథ: ఇష్టం
రచన: రాధా సింధూర
పత్రిక: ఈనాడు
అప్పుడే కొత్తగా పెళ్లయిన అమ్మాయిల్లో కొంత భయం, ఇంకొంత అనుమానం ఉంటాయి. ముఖ్యంగా పుట్టింట్లో ఉన్న స్వాతంత్ర్యం, స్వేచ్ఛ అత్తారింట్లో ఉంటాయా, లేవా? అని. తన మాట నెగ్గుతుందా లేదా? అని. ఇండిపెంటెండ్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిల్లో ఇది మరింత ఎక్కువ ఉంటుంది. అయితే… సంసారం అంటే ఆధిపత్యపోరు కాదు. అరమరికలు లేని జీవితం. అందరినీ కలుపుకుపోవడం. మన మాటకు విలువ ఉండాలి అనుకొన్నప్పుడు, ఎదుటివాళ్ల అభిప్రాయానికీ అలాంటి విలువే ఇవ్వాలి. ‘ఇష్టం’ కథతో రచయిత్రి చెప్పదలచుకొన్న పాయింట్ కూడా అదే. చాలా సింపుల్ కథ. రెండే రెండు పేజీల్లో పొదుపుగా ముగించారు.
కథ: అద్వైత
రచన: కల్పనా రెంటాల
పత్రిక: సాక్షి
ఈమధ్య కాలంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథల్లో ‘అద్వైత’ ఎన్నదగినది. చాలా లోతైన కథ. ఓరకంగా ఎమోషనల్ రైడ్. ఓ సినిమాకు తగిన కంపోజింగ్ ఈ కథలో ఉంది. మూడ్ స్వింగ్స్ తో బాధపడుతూ, నరకయాతనకు గురవుతున్న తల్లి, ఆమెను కంటికి రెప్పలా కాపాడుకొనే కూతురు. ఎవరు తల్లో, ఎవరు కూతురో తెలియని ఆత్మీయత ఇద్దరి మధ్య. తల్లి కోసం కూతురు, కూతురి కోసం తల్లి ఏం చేశారన్నదే `అద్వైత`. రచనా శైలి బాగుంది. ఫ్లో కచ్చితంగా నచ్చుతుంది. ముగింపు గుండెల్ని బరువెక్కిస్తుంది. సాధారణంగా తెలుగు దినపత్రికలు కథలకు మూడు పేజీలే కేటాయిస్తుంటాయి. `అద్వైత` మరో అర పేజీ ఎక్కువ తీసుకొంది. అంత స్పేస్ ఈ కథకు అవసరం కూడా.
కథ: డియర్ మేరీ
రచన: అఫ్సర్
పత్రిక: ఆంధ్రజ్యోతి
తెలుగులో చిక్కటి కథలు రాస్తున్న కలాల్లో అఫ్సర్ ఒకరు. ఆయన కవిత్వం కథలా ఉంటుంది. కథ కవిత్వమై మ్రోగుతుంది. ఎలాంటి విషయాన్నయినా దాన్ని సామాజిక కోణంలో చెప్పి, పాఠకుల్ని అలెర్ట్ చేయడంలో అఫ్సర్ సిద్ధహస్తుడు. అందుకే ఆయన్నుంచి కొత్త కథ ఎప్పుడొస్తుందా అని రెగ్యులర్ పాఠకులు ఎదురుచూస్తుంటారు. ‘డియర్ మేరీ’ కూడా అఫ్సర్ స్టాండర్డ్స్‌కి ఏమాత్రం తగ్గదు. ఈ కథని ఎత్తుకొన్న తీరు, నడిపించిన పద్ధతిలో అఫ్సర్ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. ‘స్నేహితుడి దిగులులో ఓ కథకుడ్ని మాత్రమే’ అని చెబుతూ శ్రీకర్ ప్రేమకథని ఆవిష్కరించిన స్టైల్ మెస్మరైజ్ చేస్తుంది. అయితే ఈకథ సంపూర్ణంగా అనిపించదు. కొన్ని అన్ క్లోజ్డ్ ఎండ్స్ ఉంటాయి. దానికి కారణం కూడా ఈ కథలో రచయితే చెబుతాడు. ”ఎంత జిగిరీ దోస్తులైనా ఎవరి కథ వాళ్లదే. యెంత దగ్గరకు వెళ్లినా వాళ్ల కథలోకి చొరబడి మనం ఏం చేయలేం” అనేస్తాడు ఓచోట. అంటే రచయిత శ్రీకర్ జీవితంలో చొరబడినంత వరకే ఈ కథ. అసలు కథేమిటో, తన బాధేమిటో ‘మేరీ’ ఏమయ్యిందో శ్రీకర్ మాత్రమే చెప్పగలడు. బైబిల్లో ఓ వాక్యాన్ని ప్రస్తావించడం, దాన్ని గుర్తు చేస్తూ కథని ముగించడం అఫ్సర్ బలాన్ని మరోసారి గట్టిగా ‘రాసి’ చెబుతాయి.
”అసలు దేన్నయినా ధ్వంసం చేయాలన్న ఆలోచన ఎలా పుడుతుంది? అందులోనూ అది నలుగురు వ్యక్తులు ప్రేమగా కలుసుకొనే చోటు అయినప్పుడు” అంటూ రచయితగా ఓ చోట ప్రశ్నిస్తాడు. పడగొడుతున్న చర్చ్‌లు, మసీదుల శిధిలాల్లో కూడా దీనికి సమాధానం దొరకదేమో…?
అఫ్సర్ నుంచి రావాల్సిన కథే ఇది.
కథ: అబ్బాజాన్
రచన: శరత్ చంద్ర
పత్రిక: నమస్తే తెలంగాణ
పరమత సహనం ఈదేశపు అతి గొప్ప సంప్రదాయం. అందుకే ఇన్ని మతాల వాళ్లు ఇక్కడ హాయిగా మనగలుగుతున్నారు. కొంతమందిలో అసంతృప్తి సెగలు ఉన్న మాట వాస్తవం. అయితే వాళ్లూ కొన్ని నిజాల్ని గ్రహించాల్సివుంది. ఈదేశంలో ఉన్న స్వేచ్ఛ ఇంకెక్కడా లేదని, రాదని తెలుసుకోవాలి. భారతదేశం కేవలం హిందువులది మాత్రమే కాదు. ముస్లిమ్‌లది, క్రిష్టియన్లది.. అందరిదీ. మనందరికీ రాజ్యాంగం సమానమైన హక్కులు ఇచ్చింది. అయితే కొంతమంది ఇంకా విద్వేషాన్ని పెంచి పోషించుకొంటున్నారు. ఉద్రేకాల్ని తట్టి లేపుతున్నారు. అలాంటి విషప్పురుగులు చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. రహీంలోనూ ఓ విషపు బీజం నాటుకొంది. ఈదేశం తనది కాదని, పాకిస్థాన్ వెళ్లిపోవాలని అనుకొంటాడు. అబ్బాజాన్ సులేమాన్ మాత్రం తన ప్రాణం ఈ మట్టిలోనే కలిసిపోవాలనుకొంటాడు. వాళ్లద్దరి మధ్య సాగిన చర్చే ఈ కథ. కొడుకు ఈ దేశాన్ని నాశనం చేయాలనుకొంటే, తండ్రి – ఆ దేశం కోసం కొడుకునే దూరం చేసుకోవాలనుకొన్నాడు. నికార్సయిన దేశభక్తి కథ ఇది.
కథ: చేతబడి
రచన: ఈదర శ్రీనివాసరెడ్డి
పత్రిక: వెలుగు
చదువులు, పెళ్లిళ్లు, సంసారం, పిల్లలూ అంటూ పరాయిదేశం పారిపోయిన కూతుర్లు.. తల్లి మరణంతో సొంతూరొచ్చి, ఆస్తులన్నీ పని మనిషి పిల్లలకు రాసిచ్చేసిందని తెలిసి పెట్టిన పంచాయితీ ఈ కథ. విలువైన ఆస్తులు పనిమనిషి పిల్లలకు ఆ తల్లి ఎందుకు రాసిచ్చింది? అనే వైనం ఈకథనంలో ఉంది. కథ మొదలెట్టినప్పుడే క్లైమాక్స్ ఏమిటో లీలగా అర్థమైపోతుంటుంది. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే సంతానానికి ఏదో చెప్పాలన్న భావం కథకుడిలో కనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే – సూక్తి ముక్తావళి లాంటి కథ ఇది.
– అన్వర్