వైఎస్ బొమ్మను పెట్టుకుని గెలిచామని గతంలో వైసీపీ నేతలు చెప్పుకునేవారు. ఇప్పుడా అవకాశం వదిలేసుకుంటున్నారు. ఇక నుంచి తాము జగన్ బొమ్మ పెట్టుకునే ఓడిపోయామని చెప్పుకోవాలని డిసైడయ్యారు. పార్టీ హైకమాండ్ కూడా అదే సూచనలు ఇచ్చింది. జయంతి కార్యక్రమాలను లైట్ తీసుకోవడం ద్వారా ఇక ఏదైనా జగన్ సెంట్రిక్ గానే రాజకీయాలు చేయాలని.. వైఎస్ ప్రస్తావన పరిమితంగా ఉండాలని సంకేతాలు పంపారు.
జగన్ మోహన్ రెడ్డి తాను వైఎస్ కన్నా గొప్ప పరిపాలన చేశానని.. ప్రజలు వైఎస్ ను మర్చిపోయి.. తనను గుర్తుంచుకుంటారని నమ్ముతున్నారు. అందుకే ఎన్నికలకు ముందు నుంచీ తన పరిపాలన గురించి చెబుతున్నారు కానీ రాజన్న రాజ్యాన్ని తెచ్చానని చెప్పలేదు. తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ప్రతీ ఇంట్లో తన ఫోటో ఉండేలా పాలన చేశానని అంటున్నారు. ఇప్పటికీ అదే చెబుతున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా తాను వ్యతిరేకత వల్ల ఓడిపోలేదని … చంద్రబాబు ఇచ్చిన హామీల వల్లే ఓడిపోయానని అంటున్నారు.
మరో వైపు వైఎస్ ను తమ వాడిగా చెప్పుకునేందుకు కాంగ్రెస్.. గట్టి ప్రయత్నాలు చేస్తోంది . షర్మిల నేతృత్వంలో ఈ మిషన్ ప్రారంభించారు. రాజకీయ వ్యాపారులు, బీజేపీతో అంటకాగే వారు… వైఎస్ చివరి కోరికను తీర్చలేని వారు ఆయన రాజకీయ వారసులు ఎలా అవుతారని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. దీనికి జగన్ వద్ద సమాధానం లేదు. అందుకే ఇక నుంచి వైఎస్ ను తమ పార్టీ మూలపురుషుడిగా చెప్పుకోవడం తగ్గించి.. జగన్ ను మాత్రమే హైలెట్ చేస్తూ… రాజకీయం చేయాలని డిసైడయ్యారు.
వైసీపీ నిర్ణయంతో మరోసారి వైఎస్ కాంగ్రెస్ నేతగా మారిపోనున్నారు. కాంగ్రెస్ తప్ప మరో పార్టీలో లేని వైఎస్ ను చనిపోయిన తర్వాత గత పదేళ్లుగా వైసీపీ నేతగా మార్చేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ నేతగా మారిపోతున్నారు. షర్మిలకే ఈ క్రెడిట్ దక్కుతుంది.