జగన్ హయంలో చక్రం తిప్పి, వ్యవస్థలన్నింటిలోనూ తన హవా నడిపించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. పెద్దిరెడ్డికి చెందిన ఇసుక నిల్వలన్నింటినీ సర్కార్ సీజ్ చేసి, స్వాధీనపర్చుకునే ప్రక్రియను మొదలుపెట్టింది.
పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి చెందిన కంపెనీలు భారీగా ఇసుకను నిల్వ చేశాయి. అన్నమయ్య జిల్లా ములకచెరువు మండలంలో పాపఘ్ని నదిలో ఇసుకను తీసి నిత్యం వందల లారీలతో ఇసుకను తీసి, డంప్ చేశారు.
వైఎస్సార్ జిల్లా గండికోట జలాశయం నుండి పుంగనూరుకు నీటిని తీసుకపోయేందుకు చేసిన కెనాల్ నిర్మాణం, గాలేరి నగరితో హంద్రీనీవా అనుసంధాన కాలువల నిర్మాణం పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీలే చేశాయి. దీంతో ఆ పనుల పేరు మీద భారీగా ఇసుకను తీసి డంప్ చేసుకున్నారు.
కొద్ది రోజులుగా పనులు జరగటం లేదన్న సమాచారంతో కలెక్టర్ ఆదేశాల మేరకు గనుల శాఖ అధికారులు డంప్ లను సీజ్ చేశారు. ఈ డంప్ ల వద్ద 27,472క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ చేసి పెట్టుకున్నట్లు లెక్కలు తేల్చారు.