మిక్కీ జె.మేయర్ నుంచి ఓ ఆల్బమ్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఆమధ్య ఆయన పేరు కనిపించడం లేదు, వినిపించడం లేదు. కొంత గ్యాప్ తరవాత ‘మిస్టర్ బచ్చన్’ కోసం ఆయన స్వరాలు అందించారు. రవితేజ – హరీష్ శంకర్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. భాగ్యశ్రీ బోర్శే కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. చిత్రీకరణ దాదాపుగా పూర్తయినట్టే. ఆగస్టులో విడుదల చేస్తారు. ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలి పాట వచ్చింది. ‘చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మా..’ అనే పాటని చిత్రబృందం విడుదల చేసింది.
సాహితి సాహిత్యాన్ని సమకూర్చిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ నృత్యరీతులు అందించారు. సాకేత్, సమీరా భరద్వాజ్ ఈ పాటని ఆలపించారు. మిక్కీ పాటల్లో చాలామట్టుకు మెలోడీ ప్రధానంగా సాగేవే. అయితే ఈమధ్య ఆయన మాస్‌ని కూడా మిక్స్ చేశారు. ఈ పాటలో మెలోడీ, మాస్ రెండూ కనిపిస్తాయి. శేఖర్ స్టైల్ లో కంపోజ్ చేసిన కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ రొమాంటిక్ గా ఉన్నాయి. హరీష్ శంకర్‌కు ‘కెవ్వు కేక’, ‘అస్మైక యోగ’ లాంటి పాటలు అందించిన సాహితి.. మరోసారి తన కలం ఝలిపించారు. చాలా చోట్ల ఆయన రొమాంటికిజం వినిపిస్తుంది. ఈ పాటలో సితార ఇన్ట్యుమెంట్ ఎక్కువగా వాడారు. అందుకే ఈ పాటకు ‘సితార్’ అనే పేరు పెట్టుకొంది చిత్రబృందం. మొత్తానికి మిక్కీ క్లాస్, మాస్ రెండింటినీ మిక్స్ చేయగలడు అని ఈ పాటతో మరోసారి నిరూపించుకొన్నాడు. ‘మిస్టర్ బచ్చన్’కు ఇది మంచి ప్రారంభమే. మిగిలిన పాటలెలా ఉంటాయో చూడాలి.