వైఎస్ జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఎంపీ పదవికి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై వైసీపీ ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వలేదు కానీ.. వైవీ సుబ్బారెడ్డి మాత్రం ఇప్పుడే కాదన్న సంకేతాలు ఇచ్చారు. ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆయన ..వైసీపీ ఉప ఎన్నికల వ్యూహాన్ని వంద శాతం ఖండించలేదు. జగన్ రాజీనామాపై వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దం. రాజీనామా చేయాల్సిన పరిస్థితి లేనప్పుడు అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని ప్రశ్నించారు. అంటే. ఆయన ఉద్దేశం ప్రకారం.. అలాంటి పరిస్థితి ఇప్పుడు రాలేదు..తర్వత వస్తుందని కావొచ్చు.
ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవాలని జగన్ అనుకోవడం లేదు. అలాంటి పరిస్థితి కల్పించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. దానికి తగ్గ ఏర్పాట్లు అంతర్గతంగా జరిగిపోతున్నాయి. వైసీపీ ఓడిపోయిందని చనిపోయారంటూ ఓదార్పు యాత్రకు లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం…తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదని లేఖలతో విక్టిమ్ కార్డు ప్రదర్శించడం వంటివి ఇందులో భాగమే. ఏపీలో రాజకీయాలు చేయడానికి ఆయనకు ఈగో అడ్డు వస్తోంది. అందుకే నాలుగు నెలల తర్వాత అయినా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారు.
ఇప్పటికిప్పుడు ఆ ఆలోచన ఉందని తెలిస్తే.. ఒత్తిడి పెరిగిపోతుంది. కడపలో ఇతర పార్టీల స్పెషల్ ఆపరేషన్లు పెట్టుకుంటాయి. అలాంటి వాటికి చాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో వైవీ సుబ్బారెడ్డి తాజా ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. వచ్చే నాలుగు నెలల నాటికి ప్రజల్లో తన పై సానుభూతి పెరుగుతుందని జగన్ నమ్మకంతో ఉన్నారు. అనుకున్నట్లుగా సానుభూతి పెరిగితే ఉపఎన్నికలకు వెళ్లిపోయే అవకాశం ఉందని వైసీపీలో ఇప్పటికే గట్టిగా గుసగుసలు వినిపిస్తున్నాయి.