కాంగ్రెస్ లో అంతే అనుకోవాల్సిన పరిణామాలు తరచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. కేకే రాజీనామా చేసిన రాజ్యసభ సీటుకు ఒక్క రోజులోనే పోటీ వచ్చేసింది. ఆ సీటు తనకే ఇవ్వాలంటూ.. ఏ మాత్రం మొహమాటం పెట్టుకోకుండా.. సీనియర్ నేత ట్యాగ్ తో వి.హనుమంతరావు మీడియా మందుకు వచ్చేశారు. గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెడితే..ఎవరైనా ప్రత్యర్థీ పార్టీపై విమర్శలు చేస్తారు. కానీ వీహెచ్ స్టైలే వేరు. పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి తనకు పదవి ఇవ్వాలని.. తనకు అన్యాయం జరిగిందని చెప్పుకంటారు.
వీహెచ్ ఎనిమిదేళ్లుగా ఏ పదవీ లేకుండా ఉన్నారట. అందుకే రాజ్యసభ సభ్యత్వం ఇవ్వమంటన్నారు. అసలు సికింద్రాబాద్ సీటు ఇస్తే.. తానే గెలిచేవాడ్నని కూడా చెప్పుకున్నారు. 2018లో పట్టుబట్టి అంబర్ పేట ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకున్న ఆయన గెలిచేస్తానని హడావుడి చేశారు కానీ చివరికి డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారు. మామూలుగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్లు కూడా ఆయన అభ్యర్థిగా నిలబడటం వల్ల రాలేదు. కానీ సికింద్రాబాద్ సీటిస్తే గెలిచేస్తానంటున్నారు.
వీహెచ్ సీనియరే కానీ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి జమానా దాటిపోయింది. తాను సీనియర్‌నని బీసీనని చెప్పి పార్టీలో ఏదో ఓ పదవి పొందాలని చేయని ప్రయత్నం ఉండదు. ఈ క్రమంలో పార్టీకి నష్టం చేస్తున్నారని కూడా పట్టించుకోరు. రేవంత్ రెడ్డిపై ఎన్ని సార్లు విమర్శలు చేశారో లెక్కే లేదు. ఇప్పుడు మాత్రం.. పదవి కోసం తెర ముందుకు వచ్చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు ఆయనకు యాక్సెస్ లేకపోవడంతో ఇలా హైదరాబాద్‌లోనే ప్రెస్ మీట్లు పెట్టి.. కోరికలు కోరుకుంటున్నారు.