జగన్ కు మరో ఝలక్ తప్పదా? మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి త్వరలోనే వైసీపీని వీడబోతున్నారా? తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా…?
మాజీ మంత్రి బుగ్గన గురించి ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత బుగ్గన కార్యకర్తలకు టచ్ లో లేకుండా పోయారు. ఒక్కసారి మాత్రమే కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఢిల్లీలోనే ఉండటంతో బుగ్గన, బీజేపీలో చేరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. చాలా రోజుల తరబడి బుగ్గన ఢిల్లీలో మకాం వేయడానికి కారణం.. బీజేపీలో చేరేందు కోసమేనా? లేక బిజినెస్ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లైన్ క్లియర్ చేసుకునేందుకా? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
జగన్ రెడ్డి కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన బుగ్గనకు కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేవారు. దీంతో తనకున్న పరిచయాతో బీజేపీలో చేరేందుకు బుగ్గన ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
బుగ్గన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మైనింగ్, సిమెంట్ వంటి వ్యాపారాలు మొదలు పెట్టారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో..గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయన రానున్న రోజుల్లో ఇబ్బందులు వస్తాయనే అంచనాతో ఉన్నారు. ఆర్థిక శాఖను విధ్వంసం చేశారని ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. ఆర్థిక దోపిడీ జరిగిందని లెక్కలతో సహా బయటపెట్టారు. ఇది తనకు ఇబ్బంది అవ్వడమే కాకుండా, వ్యాపార సామ్రాజ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందనే ముందుచూపుతో బుగ్గన.. బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదంటూ వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో రియాక్ట్ అయింది.