వడ్డీకాసుల వాడిగా పేరున్న తిరుమల వెంకన్నకే శఠగోపం పెట్టారన్న ఆరోపణలు మాజీ ఈవో ధర్మారెడ్డిపై ఎన్నోసార్లు వచ్చాయి. ఈవోగా అదనపు బాధ్యతలు చూసుకుంటూ… టీటీడీ నిధులు పక్కదారి పట్టించటంలో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలతో సర్కార్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది.
శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వ్యవహరంలో అక్రమాలకు పాల్పడ్డారని… శ్రీవాణి ట్రస్ట్ కు విరాళం ఇచ్చే పారిశ్రామికవేత్తలతో ఏర్పాటైన పరిచయంతో వైసీపీకి విరాళాలు సేకరించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు ధర్మారెడ్డిపై గుప్పుమన్నాయి. దీంతో కూటమి సర్కార్ రాగానే ధర్మారెడ్డిని సెలవుపై పంపి ఆ తర్వాత ఇప్పుడు విజిలెన్స్ విచారణకు సర్కార్ ఆదేశించింది.
స్వామి వారి బంగారు డిపాజిట్లను అనుకూల బ్యాంకుల్లో పెట్టడం… స్వామి వారికి పెట్టే నైవేద్యాలు, ప్రసాదాల తయారీ ముడి సరుకుల సరఫరాలో అవినీతికి పాల్పడ్డారని ధర్మారెడ్డిపై అభియోగాలున్నాయి. అంతేకాదు టీటీడీ ఏటా నిర్మాణాల కోసం కొంత బడ్జెట్ కేటాయిస్తుంది. అది 700కోట్ల లోపే ఉండేది. కానీ దాన్ని 1500కోట్లకు పైగా తీసుకెళ్లి… అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ మొత్తం అంశాలపై విచారణ చేయాలని, స్వామి వారిని మోసం చేయాలనుకున్న ఏ ఒక్కరూ బాగుపడలేదన్న డిమాండ్స్ చాలా కాలంగానే ఉంది.