మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో తప్పా మరో మాట మాట్లాడటం లేదు. లోక్ సభ ఎన్నికల ప్రచారం తర్వాత పూర్తిగా ఫాంహౌజ్ కే పరిమితం అవుతున్న కేసీఆర్… నేతలను కలుస్తున్నారే తప్పా ప్రభుత్వ నిర్ణయాలు, జరుగుతున్న పరిణామాలపై ఒక్కమాట అంటే ఒక్క మాట మాట్లాడటం లేదు.
తెలంగాణలో నిరుద్యోగ యువత పరీక్షల వాయిదా కోసం పోరాడుతున్నారు. ఇదంతా బీఆర్ఎస్ పెయిడ్ కార్యక్రమం అన్న విమర్శలున్నా… విద్యార్థుల అంశంలో ఏ చిన్న ఇష్యూ అయినా హరీష్ రావు, కేటీఆర్ లో ట్విట్టర్ లో రెస్పాండ్ అవుతున్నారు. హైదరాబాద్ లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా ర్యాపిడ్ రెస్పాన్స్ వస్తుంది.
కానీ, మాజీ సీఎం… ప్రతిపక్ష నేత కేసీఆర్ మాత్రం నోరు విప్పటం లేదు. డీఎస్సీ, గ్రూప్-2 ఇలా ఏ అంశంపైనా ఆయన మాట్లాడటం లేదు. దీంతో కేసీఆర్ మౌనం ఎందుకు? బీఆర్ఎస్ కు మైలేజ్ వచ్చే అంశంలోనూ కేసీఆర్ సైలెంట్ గా ఉంటే ఎలా అని సొంత పార్టీ నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే, కేసీఆర్ ఎలా రెస్పాండ్ అయినా సీఎం రేవంత్ రెడ్డి నుండి కౌంటర్ స్ట్రాంగ్ ఉంటుంది, ఒక్కటని రెండు పడటం ఎందుకులే అనుకుంటున్నారేమో అని అనే వాళ్లు కూడా ఉన్నారు. తాను ముందుగా ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలను కలుస్తూ… వారితో ఫోటోలు దిగుతూ కేసీఆర్ ఫాంహౌజ్ లోనే ఎక్కువగా ఉంటున్నారు.