వైసీపీ నేత సిద్దారెడ్డిని జగన్ రెడ్డి పార్టీ నుంచి బహిష్కరించడంతో ఇక వైసీపీలో ప్రక్షాళన ప్రారంభణయిందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. కానీ సిద్దారెడ్డి విషయంలో ఏదో పంపకాల తేడా వచ్చిందని పార్టీ నుంచి గెంటేశారు తప్ప రాజకీయ కారణాలు కాదని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే సమస్యను కూకటివేళ్లతో పెకిలించాలని ఎవరైనా అనుకుంటారు కానీ ఒక్కొక్క మొక్కను తుంచేయాలని ఎవరూ అనుకోరు. ఇక్కడ వైసీపీకి అసలు సమస్య సజ్జల రామకృష్ణారెడ్డే.
జగన్ కు అతిపెద్ద మైనస్ సజ్జల
ఎన్టీఆర్కు లక్ష్మిపార్వతిలా… జయలలితకు శశికళలా జగన్ కు సజ్జల తయారయ్యారని బాధపడని వైసీపీ నేతలు గత నాలుగేళ్లలో లేరు. మొదట పార్టీ గెలిచినప్పుడు అన్నీ చూసుకుంది విజయసాయిరెడ్డి. మెల్లగా సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారుగా కీలక స్థానంలోకి వచ్చి జగన్ కు ఏమీ తెలియదని..తానే పాలన చేస్తానన్నట్లుగా వ్యవహరించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట పట్టుకుని తాను చేయాలనుకున్నది చేసుకున్నారు. ఈ క్రమంలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఆయన పట్టించుకోలేదు.
వైసీపీపై వ్యతిరేకతకు సజ్జల కుట్రలే కారణం
విపక్ష నేతలపై దాడులు, బూతులకు కుట్రదారులు సజ్జలే. ఆ విషయం అందరికీ తెలుసు. ఓ టీమును పెట్టుకుని బూతులు స్క్రిప్టులు రాయించడం.. దాడులకు పిచ్చి ప్లాన్లు వేయడం వంటివి చేశారు. చివరికి పార్టీ నేతలకు జగన్ దర్శనం లేకుండా చేశారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాంతాడు అవుతుంది. చివరికి పార్టీకి బలమైన సోషల్ మీడియాను కొడుకు చెతిలో పెట్టి సర్వనాశనం చేసి.. బూతులు తిట్టడమే పాలసీ అన్నట్లుగా మార్చారు. ఆయనపై పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిలో ఉంది. జగన్ ఓటమికి ఎవరైనా ప్రధాన కారణం అంటే.. అది ఖచ్చితంగా సజ్జలేనని వైసీపీలో ఏకగ్రీవంగా వినిపించేమాట.
పార్టీపై సజ్జల నీడ పడకూడదంటున్న కార్యకర్తలు
సజ్జలకు పార్టీతో సంబంధం లేదు. ఆయన సలహాదారు మాత్రమే. కానీ మెల్లగా పార్టీలో ప్రధాన కార్యదర్శిగా మారారు. ఇప్పుడు ఆయనను పూర్తిగా పార్టీ నుంచి తప్పించేసి మళ్లీ సాక్షికి పంపాలన్న డిమాండ్ లు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. అయితే పార్టీలో తనకంటూ ఓ వర్గాన్ని ఇప్పటికే సజ్జల ఏర్పాటు చేసుకున్నారు. తనకూ మద్దతుందని తనను కాదంటే బీజేపీలోకి వెళ్తానని ఆయన జగన్ ను బెదిరిస్తున్నారేమో కానీ ఏ చర్యలూ తీసుకోలేకపోతున్నారు. సజ్జలతో ప్రారంభించని ప్రక్షాళన.. అసలు ప్రక్షాళనే కాదని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.