పెద్ద సినిమా విడుదలకు ముందు టికెట్ల రేట్ల పెంపుదల కోసం ప్రభుత్వం అప్పటికప్పుడు వేడి వేడిగా జీవోలు విడుదల చేయడం పరిపాటి అయ్యింది. ‘కల్కి’ సినిమాకు రేట్లు పెంచుతూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘భారతీయడు 2’ సినిమాకీ రేట్లు పెంచమని నిర్మాతలు రెండు తెలుగు ప్రభుత్వాల్నీ అభ్యర్థించారు. ఇందుకుగానూ తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
టికెట్ రేట్ల పెంపుదల విషయంలో చంద్రబాబు సర్కార్ కాస్త లిబరల్ గానే ఉంది. జగన్ రెడ్డి హయాంలో చిత్రసీమ బాగా నష్టపోయింది. టికెట్ల రేట్ల పెంపుదల విషయంలో టాలీవుడ్ మొత్తం పోరాడింది. తమ నిరసన తెలిపింది. ఇలాంటి పరిస్థితులు తెలుగు దేశం సర్కారులో ఎదురు కావన్నది అందరి నమ్మకం. `కల్కి` విషయంలో ఏపీ ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొంది. కానీ ఇప్పుడు ‘భారతీయుడు 2’ పరిస్థితి వేరు. ఇది తెలుగు సినిమా కాదు. డబ్బింగ్ బొమ్మ. అయితే నిర్మాతలు మాత్రం ‘కల్కి’ స్థాయిలోనే రేట్లు పెంచమని కోరుతున్నారు. తెలంగాణలో మల్టీప్లెక్స్ రేట్లు రూ.350 నుంచి రూ.400 వరకూ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ లో రూ.250. ఇవే రేట్లు ఏపీలోనూ ఇవ్వాలని ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న సురేష్ బాబు అభ్యర్థిస్తున్నారు. అయితే ఓ డబ్బింగ్ సినిమాకు ‘కల్కి’ తో సమానంగా రేట్లు పెంచడం భావ్యం కాదన్నది ఏపీ ప్రభుత్వ అభిప్రాయం. సినిమా బడ్జెట్ ని బట్టి టికెట్ రేట్ల పెంపుదలలో వెసులు బాటు ఉంటుందని ఇటీవల పవన్ కల్యాణ్ సినీ పెద్దలకు మాట ఇచ్చారు. డబ్బింగ్ సినిమాలకు ఒకలా, స్ట్రయిట్ సినిమాలకు ఒకలా పెంపుదల ఉండాలి. అందుకే ‘కల్కి’ రేట్లు.. ‘భారతీయుడు 2’కి వర్తించకపోవొచ్చు. ఒకవేళ అన్ని రేట్లు పెట్టినా నిర్మాతలకే నష్టం. ‘భారతీయుడు 2’ సినిమాకు ఉన్న క్రేజ్ అంతంత మాత్రమే. రేట్లు మరీ ఇలా భారీగా పెంచేస్తే తెగాల్సిన టికెట్లు కూడా తెగవేమో..?