విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ జరుగుతోన్న ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తెలుగు వారి ఆత్మగౌరవానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతీక అని, అలాంటి ప్లాంట్ ను కాపాడుకుంటాను తప్పా, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు మద్దతు తెలపనని స్పష్టం చేశారు.
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ పోరాటాలు చేసి ఫ్యాక్టరీని సాధించుకున్నామని, వాజ్ పేయ్ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరిగినా.. తాను అందుకు వ్యతిరేకంగా పోరాడినట్లు చంద్రబాబు గుర్తు చేశారు.
ఫ్యాక్టరీ తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ నాడు కేంద్ర ఆర్ధిక సాయంతో సంస్థను కాపాడుకున్నామన్నారు. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసునని, ఆ బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ చిల్లర ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు.
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పర్యటిస్తున్న సందర్భంలోనే… సీఎం చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకుంటామని హామీ ఇవ్వటం విశేషం.