తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 24 నుండి అసెంబ్లీ సమావేశాలు మొదలవనున్నాయి. అసెంబ్లీ, మండలి సమావేశాలకు సంబంధించిన అంశాలపై స్పీకర్, మండలి చైర్మన్ తో సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు భేటీ అయ్యారు.
ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీలపై ప్రభుత్వం ఈ సెషన్ లోనే కీలక ప్రకటన చేయబోతుంది.
ఇక పలు ప్రభుత్వ బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, కొత్త లోగో అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.
అయితే, ఈ సమావేశాల్లోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని… అనర్హత వేటు వేసేలా అసెంబ్లీని స్తంభింపజేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలంటున్నాయి.
ఇక, ఈ సమావేశాల్లో అయినా ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు హజరవుతారా… డుమ్మా కొడతారా అన్న ఆసక్తి నెలకొంది. గత సమావేశాల సందర్భంగా ఆయన తుంటి గాయం కారణంగా సమావేశాలకు హజరుకాలేదు.