కరకట్టపై కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఫైల్స్ ను దహనం చేసిన ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అవ్వడంతో ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సమీర్ శర్మ వద్ద ఓఎస్డీగా పని చేసిన రామారావు నివాసంలో కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో అసలు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు రామారావు ప్లాట్ తో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయంలో రెండు బృందాలు విచారణ చేపట్టాయి. ఎందుకు పీసీబీకి చెందిన ఫైల్స్ ను దహనం చేశారు..? ఆ ఫైల్స్ ఎలా బయటకు వెళ్ళాయి? పదవీ విరమణ చేశాక కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఫైల్స్ ను ఎందుకు తన వద్ద ఉంచుకున్నారు? ఇందులో రాజకీయ ప్రోద్బలం ఏమైనా ఉందా? అని ప్రశ్నించి సమాధానాలు రాబడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే, జూన్ 27వ తేదీన పీసీబీ కార్యాలయం నుంచి ఈ ఫైల్స్ బయటకు వెళ్లాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పక్కా సమాచారం మేరకు ఆరోజు పీసీబీ కార్యాలయంలోని సీసీ పుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ పుటేజ్ పరిశీలన, రామారావు సమాధానాల ఆధారంగా ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.