చంద్రబాబు సొంత నియోజకవర్గంలో టీడీపీ వ్యూహాలు తేడాగా మారుతున్నాయి. పార్టీ గెలవగానే వచ్చి పడే వైసీపీ నేతలను చేర్చుకునేందుకు ఆత్రపడటమే దీనికి కారణం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేసిన వారంతా ఇప్పుడు భయంతో పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వారెవరికీ పది ఓట్ల బలం ఉండదు. కేవలం వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్దిరెడ్డి చేసిన వ్యవహారంతోనే వారు మున్సిపల్, స్థానిక ఎన్నికల్లో గెలవగలిగారు. ఇప్పుడు ఆ తప్పుల్ని దిద్దుకునేందుకు టీడీపీలోకి వస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారంతా టీడీపీకి వ్యతిరేకంగా పని చేశారు. ఎంత చేయాలో అంత చేశారు. ఇప్పుడు అధికారం మారింది కాబట్టి టీడీపీలోకి వస్తామని బేరం పెడుతున్నారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ .. తన వర్గానికి చెందిన తొమ్మిది మంది కౌన్సిలర్లతో టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. నేరుగా చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో టీడీపీ క్యాడర్ రగిలిపోయింది. కుప్పంలో సుధీర్ ఆస్పత్రిపై దాడి చేశారు.
సుధీర్ చేసింది చిన్న చిన్న అరాచకాలు కాదు. కుప్పంలో అలజడికి ప్రధాన కారణాల్లోఆయన ఒకరు. మున్సిపల్ చైర్మన్ పోతుందన్న భయంతో ఇప్పుడు ఇలా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను చేర్చుకునేందుకు టీడీపీ అంగీకరిస్తే…. ఇప్పటి వరకూ పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను అవమానించడమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.