ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
లిక్కర్ స్కామ్ లో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మే నేలలో తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా రిజర్వ్ చేసిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడిస్తూ.. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయగా, కోర్టు తీర్పుపై హైకోర్టును ఈడీ ఆశ్రయించడంతో కేజ్రీవాల్ కు నిరాశే ఎదురైంది. కేజ్రీవాల్ అరెస్ట్ ను సమర్ధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ కు తాజాగా ఊరట లభించింది.
లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండగానే సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. దీంతో ఈడీ కేసులో కేజ్రీవాల్ కు తాజాగా మధ్యంతర బెయిల్ లభించినా సీబీఐ కేసులోనూ బెయిల్ వస్తేనే ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.