మరో 15రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తథ్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. శనివారం మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని, బీఆర్ఎస్ లో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు మినహా ఎవరూ మిగలరన్నారు. ఆత్మగౌరవం కోరుకునే వారెవరూ బీఆర్ఎస్ లో ఉండబోరన్నారు.
కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ కూడా బయటపెడుతానని హాట్ కామెంట్స్ చేశారు దానం నాగేందర్. గుండు శ్రీధర్, సత్యం రామలింగ రాజు కొడుకు వేల కోట్లు సంపాదించారని, వాటన్నింటి వివరాలు త్వరలోనే బయటపెడుతానని స్పష్టం చేశారు. దానం చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోపు బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కానుందని దానం వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది. రేవంత్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని ప్రచారం జరుగుతోన్న వేళ దానం చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో అలజడి రేపుతున్నాయి. పార్టీని వీడే ఎమ్మెల్యేలు ఎవరో తెలియక ఆ పార్టీ సతమతం అవుతోంది. దానం చెప్పినట్లుగా బీఆర్ఎస్ ను వీడే ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు అన్నది ప్రస్తుతం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.