వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను జగన్ రెడ్డి తూతూమంత్రంగా నిర్వహించారని.. సొంత తండ్రి జయంతి వేడుకలను నిర్వహించే పద్ధతి ఇదేనా అంటూ.. జగన్ రెడ్డిని షర్మిల గట్టిగానే వాయించేశారు. ఎన్నికల సమయంలో ఒక్కో సిద్దం సభకు 30, 40కోట్లు వెచ్చించిన వైసీపీ..వైఎస్ జయంతి రోజున కనీసం ఓ సభను నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జయంతి మీకు స్పెషల్ కాదా? ఇలాగేనా జరుపునేది అంటూ షర్మిల దునుమాడారు.
రాజకీయంగా ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ జగన్ కు షర్మిల కొద్ది రోజులుగా సంకేతాలు పంపుతున్నారు. ఏమాత్రం సందు దొరికినా జగన్ ను టార్గెట్ చేస్తూ ప్రజల అటెన్షన్ ను తన వైపు మళ్ళించుకోవాలనుకుంటున్నారు. వైఎస్ రాజకీయ వారసురాలుగా తనను తను ప్రొజెక్ట్ చేసుకునేలా జగన్ పై విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వైఎస్సార్ కు జగన్ రాజకీయ వారసుడు కాడని , తను మాత్రమే ఆ కోవలోకి వస్తానని షర్మిల పదేపదే చెబుతుండటం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. వైఎస్ పేరును వైసీపీ భవిష్యత్ లో ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా చేయడమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల నాటికీ వైఎస్ అభిమానులు, సన్నిహిత నేతలను కాంగ్రెస్ గొడుగు కిందకు తీసుకురావడమే లక్ష్యంగా ఆమె రాజకీయం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, ఆమె గడిచిన కొన్ని రోజులుగా జగన్ ను ఎక్కువగా టార్గెట్ చేస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీని దెబ్బకొట్టడమే తక్షణ కర్తవ్యంగా భావించి దూకుడు పెంచుతున్నారని అంటున్నారు. అయితే, జగన్ పై షర్మిల ఓ రేంజ్ లో విమర్శలు చేసినా వైసీపీ నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు. జగన్ తన చెల్లికి కౌంటర్ ఇచ్చే సాహసం ఇప్పట్లో చేసేలా కనిపించడం లేదు. దీంతో షర్మిలను ఢీకొట్టేందుకు వైసీపీ నుంచి జగన్ ఎవరిని రంగంలోకి దింపుతారు అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.