వైసీపీ ఇంకా మారడం లేదు. అప్పుడూ, ఇప్పుడూ తప్పుడు ప్రచారమే ఎజెండాగా రాజకీయం చేస్తోంది. అసత్యాలు, అర్దసత్యాలే పార్టీ ఎదుగుదలకు సోపానాలుగా పాలిటిక్స్ చేస్తోంది. ఇటీవలే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు చంద్రబాబు అంగీకరించారంటూ ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనంతో పెద్ద రచ్చ చేసి నాలుక కర్చుకున్న వైసీపీ..మరో తప్పుడు ప్రచారానికి తెరలేపి ప్రజాగ్రహానికి గురి అవుతోంది.
తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే విద్యార్థులందరికీ ఏటా 15,000 ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించింది. కాగా, ఇంట్లో ఒకరికి మాత్రమే తల్లికి వందనం పథకం ద్వారా సాయం అందించాలని తాజాగా కూటమి సర్కార్ నిర్ణయించినట్లుగా ఓ ప్రచారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ కూడా విడుదల అయ్యాయంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నిజమనుకొని సర్కార్ పై అసంతృప్తి వ్యక్తమైంది.
తాజాగా దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత నిచ్చింది. తల్లికి వందనం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చేయలేదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం అంతా వైసీపీ సృష్టించిన కల్పిత కథనమేనని స్పష్టమైంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీని ఘోరంగా ఓడించినా ఇంకా బుద్ది మార్చుకోవడం లేదని మండిపడుతున్నారు.