బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీఫ్ ధన్ ఖడ్ తో సమావేశం అయ్యారు. విలీన అంశంపై చర్చలు జరిపారని చెబుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు కానీ.. అత్యున్నత స్థాయి రాజకీయవర్గాలు మాత్రం.. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెబుతున్నారు. దానికి తగ్గ పరిణామాలు ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి.
ప్రస్తుతం బీఆర్ఎస్ కు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, హెటెరో పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో లోక్ సభ లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మరో ఎంపీ కేశవరావు కాంగ్రెస్ లో చేరి.. తన పదవికి రాజీనామా చేశారు.
నలుగురు రాజ్యసభ సభ్యలు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులే అయితే ఈ ఎంపీల విలీన రాజకీయం బీఆర్ఎస్ హైకమాండ్ కు తెలిసే జరుగుతోందని కేటీఆర్, హరీష్ ఢిల్లీ పర్యటనను బట్టి రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం . పూర్తి మెజార్టీ లేదు. అందుకే రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవాలన్న ఆలోచనకు వచ్చిటనట్లుగా చెబుతున్నారు.