వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగుసుకునేలా కనిపిస్తోంది. ఆయన ఇలాకాలో అక్రమంగా మరోసారి పెద్దమొత్తంలో రేషన్ నిల్వలు పట్టుబడటం కలకలం రేపుతోంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టించిన ఘటనను సీరియస్ గా తీసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్… ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాకినాడలో జరిపిన వరుస సోదాలో 24,936 టన్నుల పీడీఎస్ బియ్యం నిల్వలు ఉండటంతో అధికారులు సైతం విస్తుపోయారు.
కాకినాడలో రెండు వారాలుగా విస్తృతంగా తనిఖీలు చేపడుతోన్న అధికారులు 24వేల టన్నుల రేషన్ బియ్యాన్ని పలుచోట్ల గుర్తించారు. రేషన్ బియ్యాన్ని యాంకరేజి పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. అయితే, ఈ రేషన్ బియ్యం పక్కదారి పట్టించిన ఘటనలో అన్ని వేళ్ళు ద్వారంపూడి వైపు చూపిస్తున్నాయి.
వైసీపీ హయంలోనే ఆయనపై రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబీకులే పౌరసరఫరాల సంస్థ చైర్మన్, మిల్లర్ల సంఘం , షిప్పింగ్ సంస్థలో అధ్యక్ష పదవుల్లో ఉన్నారు. ఈ అక్రమ నిల్వలు పట్టుబడిన చోట్ల యాజమాన్యాల పేరుతో ఈ వ్యవహారం కొనసాగుతున్నా మొత్తం ద్వారంపూడి కనుసన్నలోనే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో ఈ విషయంపై సీరియస్ గా దృష్టిసారించిన సర్కార్.. పేదల బియ్యం పక్కదోవ పట్టడానికి కారకులు ఎవరు..? ఈ అక్రమ నిల్వలకు అండగా ఉంటుంది ఎవరు..? విదేశాలకు ఎగుమతి చేయాలనే ప్లాన్ ఎవరిదీ…? ఎవరి ఆదేశాలతో ఇదంతా సాగుతోంది..? అని లోతైన దర్యాప్తు చేయనున్నారు. ప్రస్తుతం కనిపిస్తోన్న పరిణామాలను చూస్తుంటే మాత్రం ద్వారంపూడి ఇబ్బందుల్లో కూరుకుపోయే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.