కృష్ణతేజ ఐఏఎస్. కొన్ని రోజులుగా ఈ పేరు బాగానే వినపడుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీంలో చేరబోతున్నారని… నిక్కచ్చిగా ఉండే ఇలాంటి అధికారులు ఏపీకి అవసరం అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ వచ్చింది.
నిజానికి కృష్ణతేజ ఐఏఎస్ ఏపీకి చెందిన వ్యక్తే. కానీ, కేరళ క్యాడర్ లో పనిచేస్తున్నారు. 2015వ సంవత్సరానికి చెందిన ఈ అధికారికి అతి తక్కువ వయస్సులోనే తన పనికి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అలెప్పీలో వరదల సమయంలో తన పనికి అంతర్జాతీయ సంస్థలు కూడా ప్రశంసించాయి. ప్రభుత్వ సహయంతోనే కాదు ప్రజలకు అండగా ఉండాలన్న తపన ఉంటే ఏమైనా చేయవచ్చు అని… సోషల్ మీడియా ద్వారా నిధుల సేకరణ చేసి, సామాన్య ప్రజలకు అండగా ఉన్నారు.
అధికారికి ప్రజల ఇబ్బందులు తెలిస్తే… వారి బాధలను తీర్చే అధికారిని ప్రజలు ఆరాధిస్తారు. కృష్ణతేజ ఐఏఎస్ విషయంలోనూ అదే జరిగింది.
ఇప్పుడు ఆ అధికారిని ఏపీ సర్కార్ ఏరీ కోరీ తెచ్చుకుంది. కేంద్రంతో సంప్రదించి… డిప్యూటేషన్ పై తీసుకొచ్చింది. కేంద్రం ఉత్తుర్వుల ప్రకారం మూడు సంవత్సరాల పాటు కృష్ణతేజ ఏపీలో పనిచేయబోతున్నారు.