హైదరాబాద్ లో కమ్మ గ్లోబల్ సమావేశాలు పెడుతున్నామని దానికి హాజరు కావాలని కొంతమంది పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వానించారు. ఈ విషయాన్ని ఎన్నారై ప్రముఖ టీడీపీ లీడర్ వేమన సతీష్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసుకున్నారు. ఈ కమ్మ గ్లోబల్ సమావేశాలకు కేజీఎఫ్ అని పేరు పెట్టుకున్నారు. అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. ఎప్పుడు పెట్టారో కానీ గతంలో ఎప్పుడూ పెద్దగా వినిపించలేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జెట్టి కుసుమకుమార్ దీనికి నాయకుడు.
కొద్ది రోజుల కిందట తాము హైదరాబాద్లో నిర్వహించే సమావేశాలకు రెండు తెలుగు సీఎంలు వస్తారని ప్రకటించారు. నిజానికి అప్పటికీ ఆయన ఎవరికీ ఆహ్వానాలు ఇవ్వలేదు. వేమన సతీష్ సాయంతో ఏపీ సీఎంను కలిసి ఆహ్వానించారు. చంద్రబాబు హాజరవుతారన్నట్లుగా ప్రచారం చేసేసుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు ఈ కుల సంఘాల సమావేశాలు పెట్టుకుని అన్ని పార్టీల నేతల్ని అహ్వానిస్తూంటారు. తమ డిమాండ్లు చెబుతూంటారు. ఎన్నికలయ్యాక ఇలాంటి సమావేశాలకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వాళ్లు దాదాపుగా హాజరు కారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కులానిది ప్రముఖ పాత్ర. అయితే ఏ ఒక్కరు కూడా ఒక్క కులం ఓటు వేస్తే విజయం సాధించరు. అది ఎదురుగా ఉండే నిజం. అన్ని కులాల వాళ్లు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. అందుకే నాయకత్వ స్థానంలో ఉన్న వారు ఎవరూ కుల మీటింగ్లకు వెళ్లరు. వాళ్లను రావాలని పరిచయస్తులు కూడా ఒత్తిడి చేయకూడదు. ఏ ఒక్క నాయకుడి వల్ల ఏ ఒక్క కులం బాగుపడదు… అంతే కాదు.. ఆ కులం వల్లనే నాయకుడు ఎదగలేడు కూడా. అందుకే తెలివైన రాజకీయ నాయకులు కుల సంఘాల రాజకీయాలకు చాలా దూరంగా ఉంటారు.
అటు ఏపీ సీఎం అయినా .. ఇటు తెలంగాణ సీఎం అయినా ఈ కేజీఎఫ్ సమావేశాలకు హాజరవుతారని ఎక్కడా చెప్పలేదు. వారు ఆహ్వానాలు మాత్రమే ఇచ్చారు. వారికి అంత కంటే ముఖ్యమైన పనులు ఉంటాయని ఎక్కువ మంది నమ్మతున్నారు.