ఏడు రాష్ట్రాల్లో పదమూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం ఎదురయింది. పదకొండుచోట్ల కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు విజయం సాధించగా.. ఒకచోట ఇండిపెండెంట్, మరో స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలు బీజేపీకి అంతకంతకూ పెరుగుతున్న గడ్డు పరిస్థితిని చూపిస్తున్నాయి.
బీహార్లో ఒక్క చోట ఉపఎన్నిక జరిగితే అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అది బీజేపీ మిత్రపక్షం జేడీయూ సిట్టింగ్ సీటు. అక్కడ కూడా వెనుకబడిపోయారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఫిరాయింపు రాజకీయాల కారణంగా వచ్చిన నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మూడు చోట్ల విజయం సాధించింది బీజేపీ ఒక్క చోట మాత్రం స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించింది.
ఇక మధ్యప్రదేశ్ ఒక్క స్థానానికి జరిగిన ఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ బీజేపీ ఫిరాయింపులకు పాల్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారు. ఆయన రాజీనామా చేసి బీజేపీ తరపున మళ్లీ పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థే గెలిచారు. అంటే బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ అయ్యారు. సీటు కాంగ్రెస్ ఖాతాలోనే ఉండిపోయింది. పంజాబ్ లో ఒక్క సానానికి ఉపఎన్నిక జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ నేత భారీ మెజార్టీతో గెలిచారు. తమిళనాడులో ఒక్క స్థానానికి జరిగిన ఉపఎన్నికలో డీఎంకే విజయం సాధించింది. ఉత్తరాఖండ్లో రెండు స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే రెండింటిలోనూ కాంగ్రెస్ గెలిచింది. బెంగాల్ లో ఉపఎన్నికలు జరిగిన నాలుగు స్థానాల్లో తృణమూల్ అభ్యర్థులు భారీ విజయం సాధించారు
ఒక్క తమిళనాడులో మినహా బీజేపీ అన్ని చోట్ల ప్రధాన పోటీదారుగా ఉంది. కానీ సరైన ఫలితాలను సాధించలేకపోయారు. ఇది బీజేపీకి ఇబ్బందికరమే. ఓ రకంగా పరాభవం ఎదురయినట్లే.