శుక్రవారం విడుదలైన ‘భారతీయుడు 2’ డిజాస్టర్ టాక్ మూటగట్టుకొంది. తమిళంతో పోలిస్తే తెలుగులోనే ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి. దాంతో తమిళంలో ఈ సినిమా పరిస్థితేమిటో అర్థం చేసుకోవొచ్చు. మరో రెండు రోజులు ఆగితే ‘భారతీయుడు 2’తో నిర్మాతలు ఎంత నష్టపోయారో లెక్కలు తేలిపోతాయి.
అయితే కమల్ హాసన్ మాత్రం ఈ ప్రాజెక్ట్ ద్వారా బాగానే సొమ్ములు చేసుకొన్నారన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘భారతీయుడు 2’, ‘భారతీయుడు 3’కి కలిపి ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం అందుకొన్నాడట కమల్. ‘భారతీయడు 2’ సెట్స్‌పైకి వెళ్లేటప్పుడు 3 తీయాలన్న ఉద్దేశం లేదు. అప్పటికి కమల్ పారితోషికం రూ.75 కోట్లే. కానీ ఎప్పుడైతే 3 ప్రపోజల్ వచ్చిందో అప్పుడు మరో రూ.75 కోట్లు డిమాండ్ చేశాడట. నిర్మాతలు కూడా అందుకు అంగీకరించాల్సివచ్చింది. విచిత్రం ఏమిటంటే మిగిలిన వాళ్లంతా ఒకే ఒక్క పారితోషికంతో సర్దుకొన్నారు. కమల్ మాత్ర రెండు పారితోషికాలు అందుకొన్నాడు. ఈ చిత్ర నిర్మాణంలో శంకర్ కూడా భాగస్వామినే. నష్టాలొస్తే ఆయన సైతం భరించాల్సిందే. ఓ వైపు పారితోషికం లేదు. మరో వైపు నష్టాలు ఎదురయ్యాయి. అలా.. ఈ సినిమాతో రెండు రకాలుగానూ నష్టపోయాడు శంకర్.
మరో ఆరు నెలల్లో ‘భారతీయుడు 3’ విడుదల చేస్తానని శంకర్ ప్రకటించాడు. కానీ.. ఆరు నెలల తరవాత ఈ సినిమాని ప్రేక్షకులు పట్టించుకొంటారా, లేదా? అనే సందేహం ఉంది. వీలైనంత త్వరగా విడుదల చేస్తే అంతో కొంత క్రేజ్ ఉండొచ్చు. లేదంటే నేరుగా ఓటీటీలో విడుదల చేసుకొన్నా మంచి ఆలోచనే అవుతుంది.