పంట రుణాల మాఫీకి మార్గదర్శకాలను ఖరారు చేసింది తెలంగాణ సర్కార్. 2 లక్షల వరకు ఉన్న అన్ని పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైతును గుర్తించేందుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది.
2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13వ తేదీ వరకు తీసుకున్న పంట రుణాలకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. మొదట చిన్న రైతుల రుణాలు మాఫీ చేస్తూ..క్రమంగా 2 లక్షల రుణమాఫీని పూర్తి చేయనున్నారు. పంట రుణాల మాఫీ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్సైట్ను కూడా రూపొందించింది.
గతేడాది కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో రూ.2 లక్షల రుణమాఫీ కూడా ఉంది. తాము అధికారంలోకి వచ్చాక ఏకకాలంలోనే రెండు లక్ష్గల రుణమాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలని పట్టుదలగా ఉన్న ఆయన పార్లమెంట్ ఎన్నికలు ముగిశాక దీనిపై విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు. ఆగస్టు 15 వరకు ఈ రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ చకచక అడుగులు వేస్తోంది.