బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అప్రకటిత యుద్ధం ప్రకటించినా… సీఎం రేవంత్ అండ్ కో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. రోజుకో ఎమ్మెల్యే, పూటకో కార్పోరేషన్ అన్నట్లుగా సమాధానం చెప్తున్నారు.
గడిచిన మూడు రోజులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. తాజాగా పార్టీ మారిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నేత. మాజీ మంత్రి హరీష్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఆయన కూడా పార్టీ మారుతున్నారని… మూడు రోజుల నుండి చర్చ నడుస్తున్నా, హరీష్ స్వయంగా వెళ్లి కలిసినట్లు కానీ నచ్చజెప్పినట్లు కానీ ఎక్కడా కనపడలేదు.
నిజానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో పాటు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిలు అందరికన్నా ముందు సీఎం రేవంత్ ను కలిశారు. అప్పట్లో బీఆర్ఎస్ అంతా ఒక్కసారిగా షాక్ అయిన సందర్భం అది. ఎందుకంటే కేసీఆర్ సొంత జిల్లా నుండి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటే క్యాడర్ అంత ఉలిక్కిపడింది. ఆ తర్వాతే కేసీఆర్ ఎమ్మెల్యేలను కలవటం స్టార్ట్ చేయటం, మహిపాల్ రెడ్డి కూడా నేను పార్టీ మారను అని మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.
కానీ, ఇప్పుడు కండువా మారిపోయింది. మిగతా ఎమ్మెల్యేలు కూడా లైన్ లో ఉన్నారు. 10మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరగా… తాము పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమే. ప్రజలు కాంగ్రెస్ కు పరిపాలించమని అవకాశం ఇస్తే మూడు నెలల్లో సర్కార్ పడిపోతుందని బీఆర్ఎస్సే మొదలుపెట్టింది. ప్రజా తీర్పును కాపాడేందుకే ఇష్టం లేకున్నా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నాం అంటూ కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది.
ఈనెల 22 లేదా 24వ తేదీ నుండి అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. ఈలోపు ఎల్పీ విలీనానికి సరిపడా నెంబర్ ను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ కనపడుతోంది.