ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెర వెనుక చాలా జరుగుతున్నట్లుగా జరుగుతున్న పరిణామాల డాట్స్ కలిపితే అర్థం చేసుకోవచ్చు. కానీ అదేమిటన్నది మాత్రం అర్థం చేసుకోవడం కష్టం. ప్రజాదర్బార్ ప్రారంంభిచేస్తానని చెప్పిన జగన్ రెడ్డి తెల్లవారక ముందే కాలునొప్పికి మందులు కావాలని ప్రత్యేక ఫ్లైట్ బుక్ చేసుకుని బెంగళూరు వెళ్లిపోయారు. ఆయన అంత హడావుడిగా ఎందుకు వెళ్లిపోయారో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. కాలునొప్పి అన్నారు కానీ ఆయన ఎయిర్ పోర్టులోకి చకచకా వెళ్లిపోయారు.
ఈ సస్పెన్స్ ఇలా కొనసాగుతూండగానే.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన ఢిల్లీ పర్యటన అధికారిక పనుల పన్నా రాజకీయ అంశాలపైనే ఎక్కువ చర్చిస్తారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా టీడీపీ, బీజేపీ, జనసేన ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే రాజ్యసభ సభ్యుల్ని చేర్చుకోవాలంటే… మిత్రపక్షాలతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ఈ కోణంలోనే .. చంద్రబాబుతో చర్చించేందుకు అమిత్ షా పిలుపు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోచవ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేదు. ఎన్డీఏకు కూడాలేదు. అందుకే బీఆర్ఎస్, వైసీపీ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకుంటే… మెజార్టీ వస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. ఒడిషాలో అధికారం కోల్పోయిన బీజేడీ ఇక మద్దతిచ్చేది లేని ఖరాఖండిగా చెబుతోంది. దీంతో బీజేపీకి జాగ్రత్తపడాల్సిన అవసరం వచ్చింది. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేరు. ద్వైవార్షిక ఎన్నికలు వచ్చినప్పుడే మళ్లీ చాన్స్ వస్తుంది.
బెంగళూరులో ఉన్న జగన్ ఇప్పుడల్లా మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేదు. బీజేపీ ఆపరేషన్ పూర్తయిన తర్వాతనే ఆయన తిరిగి వస్తారు . ఇందుకు జగన్ కూడా చేయగలిగిందేమీ లేదు. బీజేపీ ఏం చేసినా నోరు మెదిపే పరిస్థితి లేదు.