తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో మరోసారి విశాఖ మెట్రో డ్రీమ్ సాకారంపై ప్రజలు ఆశలు పెంచుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షల్ని గుర్తించిన చంద్రబాబు ఇప్పటికే .. ఈ అంశంపై అధికారులతో చర్చించారు. NHAIతో సమన్వయం చేసుకుని మెట్రోను శరవేగంగా నిర్మించడం గురించి వర్కవుట్ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నిజానికి టీడీపీ మొదటి దశ పాలనో విశాఖ మెట్రోకు సంబంధించి టెండర్ల పనులు కూడా పూర్తయ్యాయి. ఎస్సెల్ ఇన్ ఫ్రా పనులు ప్రారంభించే సమయానికి జగన్ రెడ్డి కుర్చీలో కూర్చున్నారు. విశాఖకు గ్రహణం పట్టింది. ఆ ప్రాజెక్టు ఆపేశారు. ఐదేళ్ల తర్వాత విశాఖ మెట్రో ఎక్కడ ఉందంటే… మళ్లీ డీపీఆర్ దగ్గరే ఉంది. అంటే పనులు ప్రారంభించాల్సిన రేంజ్ నుంచి డీపీఆర్ దాకా వెనక్కి పోయింది.
వైసీపీ ప్రభుత్వం చేసిన సకల విధ్వంసాల్లో ఇది కూడా ఒకటి కావడంతో ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కించాల్సిన పనిలో పడింది. చంద్రబాబు తక్కువ ఖర్చుతో ఎక్కువ భాగం మెట్రోను కవర్ చేసేలా చూస్తున్నారు. ఇతర జాతీయ సంస్థల ప్రాజెక్టులతో కలపడం వల్ల ఖర్చు మిగులుతుందని త్వరగా పని అయిపోతుదంని భావిస్తున్నారు. మొదటగా స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకూ మెట్రోను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. NHAI విశాఖ నగరంలో పన్నెండు చోట్ల ఫ్లైఓవర్లు నిర్మిస్తోంది. ఇవన్నీ మెట్రో రూట్లలో ఉండేవే. వీటిని మెట్రోకు అవసరమైనట్లుగా మార్పులు చేసుకునేలా చేస్తే… త్వరగా మెట్రో అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ఆలోచన.
మొదటి దశను విశాఖ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తర్వాత … విశాఖ ఎయిర్ పోర్టు ప్రారంభం తర్వాత ఎయిర్ ట్రాఫిక్ .. ప్రయాణికుల రాకపోకల్ని బట్టి రెండో దశను బోగాపురం వరకూ విస్తరించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజన నాటి నుంచి విశాఖ ప్రజలకు మెట్రో ఓ కలగా మారింది. 2014-19 మధ్య.. ఆర్థిక సవాళ్లు… ఇతర కారణాల వల్ల.. ప్లానింగ్ వరకూ పూర్తయినా తర్వాత ప్రభుత్వం దాన్ని కొనసాగించి ఉంటే ఈ పాటికి మెట్రోను విశాఖ ప్రజలు చూసేవారు. వచ్చే ఐదేళ్లలో విశాఖ మెట్రోను చూస్తామని గట్టిగా ఆశపడుతున్నారు.