ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేస్తూ..గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం, భూదోపిడీని బయటపెడుతుండటంతో వైసీపీ నేతలు రక్షణ పొందే మార్గాలపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇంకా వైసీపీలోనే కొనసాగితే తమను అరెస్ట్ చేయడం తథ్యమని, ఈమేరకు పార్టీని వీడాలని నిర్ణయించుకుంటున్నారు.
కూటమి పార్టీల్లోని టీడీపీ, జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా అవినీతి, అక్రమాలకు పాల్పడిన నేతలకు ఎంట్రీ లేదని ఇప్పటికే ఆ రెండు పార్టీలు స్పష్టం చేశాయి. ఇక ఉన్నదల్లా బీజేపీ మాత్రమే. దీంతో కమలంలో పార్టీలో కర్చీఫ్ వేసేందుకు కొంతమంది వైసీపీ నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి తమకు ఉన్న పరిచయాల ద్వారా బీజేపీ కండువా కప్పుకోవాలని చూస్తున్నారు.
ఇందులో భాగంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు భూకబ్జాలకు సంబంధించిన వ్యవహారాలను చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా బయటపెట్టడంతో మరికొంతమంది వైసీపీ నేతలు హడలిపోతున్నారు. తమకు కొద్ది రోజుల్లో ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్నారు.
అవినీతి, అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షించాలని చంద్రబాబు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నారు. కానీ, తెలివిగా వైసీపీ నేతలు రక్షణ కోసం బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి నేతలను బీజేపీ చేర్చుకుంటే, చంద్రబాబు చేస్తోన్న కృషి నిష్ప్రయోజనమే అవుతుంది. అందుకే ఆర్థిక నేరాలకు , భూకబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలకు బీజేపీలో ఆశ్రయం కల్పించవద్దన్నా డిమాండ్లు ఆ పార్టీ నుంచే వినిపిస్తుండటం గమనార్హం. చూడాలి మరి ఏం జరుగుతుందో.