తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్య శ్రీ… ఇప్పటి వరకు ఉన్న నిబంధన ఇది. ఆరోగ్య శ్రీ పథకం ప్రారంభమైనప్పటి నుండి తెల్లరేషన్ కార్డుతో ఆరోగ్య శ్రీ పథకానికి లింకు ఉంది. తాజాగా ఈ నిబంధనను తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య శ్రీ కార్డు ఉండాలని… రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి హెల్త్ ప్రోఫైల్ రెడీ చేయాలని సీఎం రేవంత్ వైద్యారోగ్య శాఖను ఆదేశించారు.
ఆరోగ్య శ్రీ పథకం కింద… అనుమతి ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఒక్కొక్కరికీ 10లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్న ప్రభుత్వం, తెల్లరేషన్ కార్డుతో ఉన్న ఉన్న లింకును తొలగించింది. ఇప్పటి వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే ఆరోగ్య శ్రీ కార్డులు మంజూరు అయ్యాయి.
రాష్ట్రంలో ఉన్న వైద్య సదుపాయాలు, బెడ్స్ పై ఆరా తీసిన సీఎం… ప్రతి బెడ్ కు ఒక నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రుల మెయింటనెన్స్ ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఆచరణలోకి వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు.