ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం రాజకీయ అంశాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు. పారదర్శకంగా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా వ్యవహరించాలని మంత్రులకు సూచించారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయని..నదుల్లో పూడిక,బోట్ సొసైటీల ద్వారా 80లక్షల టన్నుల ఇసుక వస్తుందని వివరించారు.
ఇక, కొత్త మంత్రులు త్వరితగతిన తమ శాఖలపై అవగాహనా పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ నెల 22 నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంత్రులు తమ శాఖలపై పట్టు పెంచుకోవాలన్నారు. ప్రతి నెలా తమ శాఖలపై రివ్యూ చేసి..వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు.