వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ఏ శాఖకు మంత్రులో ఎవరికీ తెలియదు. అసలు మంత్రులెవరూ మాట్లాడరు. కానీ సంబంధం లేని వారు మాట్లాడుతూ ఉంటారు. హోంశాఖ మంత్రిగా వనిత ఉంటారు..కానీ సజ్జల నుంచి పేర్ని నాని వరకూ చాలా మంది లా అండ్ ఆర్డర్ పై మాట్లాడేస్తారు. అసలు వనిత మాత్రం మాట్లాడరు. పోనీ వేరే శాఖలపై అయినా మాట్లాడతారా అంటే.. ఆమెకు ఆ యాక్సెస్ ఉండదు.
ఒక్క వనితే కాదు.. డిప్యూటీ సీఎంలు ఎవరూ తమ శాఖల గురించి మాట్లాడేవారు కాదు. నోరున్న కొంత మందిని ఎంపిక చేసి వారికే ఏమి మాట్లాడాలన్నదానిపై నోట్ పంపిస్తారు. వారు మాట్లాడేస్తారు. ఇది మా శాఖ కాదే అన్న డౌట్ వారికి కూడా వచ్చేది కాదు. ఎదుకంటే వీరి శాఖల గురించి వేరే వారితో మాట్లాడింప చేస్తూ ఉంటారు. అలాంటి గందరగోళం ఉండేది.. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎవరూ తీసుకు రావొద్దని మంత్రులకు చంద్రబాబు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు.
ఉచిత బస్సు పథకం గురించి మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్వీట్ చేసారు. ఇది రవాణాశాఖకు సంబంధించిన విషయం అని రాంప్రసాద్ రెడ్డి చెప్పాల్సిన విషయాన్ని నువ్వెందుకు జోక్యం చేసుకున్నావని చంద్రబాబు ప్రశ్నించడంతో అనగాని వద్ద సౌండ్ లేకుండా పోయింది. వెంటనే ట్వీట్ డిలీట్ చేయించారు. ఒకరి శాఖల్లో మరొకరు ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక ఎవరూ మరొకరి శాఖల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు.