కేసీఆర్ కు అన్నీ సమస్యలే. దేనికీ పరిష్కారం దొరకడం లేదు. తాజాగా ఆయనపై పాత మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా గురి పెట్టారు. బీజేపీతో జరుపుతున్న చర్చల సారాంశమేమిటో చెప్పాలని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేశారు. బీజేపీలో విలీనం అవుతున్నారా లేకపోతే పొత్తులు పెట్టుకుంటున్నారో చెప్పాలన్నారు. మాజీ ఎంపీ.. వినోద్ కుమార్.. చర్చలు జరుగుతున్నాయన్నట్లుగా చేసిన ప్రకటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన జరిగితే బీజేపీ బలపడుతుందని తాను ముందు నుంచి చెబుతున్నానని .. అప్పట్లో కాంగ్రెస్ నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీకి కూడా చెప్పానన్నారు. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. ఓవైసీ ఇప్పటికే కేసీఆర్ ను వదిలించేసుకున్నారు. పదవిలో ఉన్నంత కాలం మామూ కేసీఆర్ అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్ కే మద్దతన్నట్లుగా ప్రకటనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కోసం నేరుగా ప్రచారం చేశారు. అయినా ఫలితం లేపోయింది.
ఓవైసీ విధానం.. ఎప్పుడూ ఒక్కటే. ఆ పార్టీకి మేనిఫెస్టో లేనట్లే… అధికారంలో ఉన్న పార్టీనే మిత్రపక్షం. వాళ్లు కలుపుకోవడమే ఆలస్యం. రేవంత్ రెడ్డి కలుపుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఓ ఆట ఆడుకున్నారు. పాతబస్తీలో ఇప్పుడిప్పుడే ఎంబీటీ బలం పుంజుకుంటోంది. కాంగ్రెస్ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తే మజ్లిస్ మరింత బలహీనపడుతుంది. అందుకే పెద్దగా బెట్టు చేయకుండానే ఓవైసీ కాంగ్రెస్ ఫోల్డ్ లోకి వెళ్లిపోయాడు. ఆయన ఇప్పుడు కేసీఆర్ ను బీజేపీతో బంధం గురించి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.