అమరావతిలో భూముల లావాదేవీలు పెరుగుతున్నాయి. ధరలు రెట్టింపు అయినా రిజిస్ట్రేషన్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రాక ముందు మెట్ట ప్రాంతంలో గజం రూ.20 వేలు నుంచి 25 వేలు వరకు అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు రూ.35 నుంచి రూ.50 వేలకు పెరిగిందని రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మాగాణి భూముల్లో పోయిన సంసంవత్సరం గజం రూ.35 వేలు ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.60 వేలకు చేరుకుంది. ఈ స్థాయిలో ధర పెరగడంతో ఇంత కాలం వేచి చూసిన వాళ్లు అమ్ముకుంటున్నారు.
ధరలు పెరిగినప్పటికీ లావాదేవీలు పెరుగుతున్నాయి. తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం గత ఐదేళ్లుగా వెలవెలబోతూ వస్తోంది. కానీ ఇటీవల పెరిగింది. గత నెలలో 280 రిజిస్ట్రేషన్లు జరిగితే.. ఈ నెలలో ఇప్పటికే 150కిపైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు చాలా వరకూ ఇచ్చారు. ఆ ప్లాట్లను కొనేందుకు బడా కార్పొరేట్ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో అమ్ముకునేందు ఆసక్తి ఉన్న వారి కోసం తిరిగే బ్రోకర్లు ఎక్కువగా రాజధాని గ్రామాల్లో కనిపిస్తున్నారు.
ఇక రాజధాని సమీపంలోని పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట, తాడికొండ, మంగళగిరి, పెదకాకాని వంటి చోట్ల గతంలో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు అన్నీ ఫుల్ అయిపోయాయి. కొత్త వెంచర్ల వైపు దృష్టి పెడుతున్నారు. కూడా గత రెండు నెలల కాలంలో పొలాలకు, స్థలాలకు 50 నుంచి వంద శాతం వరకు ధరలు పెరిగాయి. ఎక్కువ మంది ఇంకా పెరుగుతాయని.. హోల్డ్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.