pekamedalu movie review
ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ ఇంజనీర్ మధ్యతరగతి మనిషే. ఎందుకంటే గాల్లో మేడలు కట్టగలిగే సామర్థ్యం వాళ్లకే ఉంటుంది. జీతానికీ, జీతానికి మధ్య నలిగే జీవితాలు వాళ్లవి. ఆశలు, ఆగాధాల మధ్య ఊగిసలాడే కలలు వాళ్లవి. అలాంటి కథల గురించి ఎన్నిసార్లు చెప్పుకొన్నా బోర్ కొట్టదు. ఓరకంగా ‘పేక మేడలు’ అలాంటి కథే! అయితే ఇక్కడ ఆశ కంటే, పేరాశే ఎక్కువ కనిపిస్తుంది. మరి ఆ దురాశ మధ్య తరగతి మనిషిని ఎంత దూరం తీసుకెళ్లింది?
లక్ష్మణ్ (వినోద్ కిషన్), వరలక్ష్మి (అనూష కృష్ణ) భార్యా భర్తలు. బస్తీలో కాపురం చేస్తుంటారు. లక్ష్మణ్ బీటెక్ చదువుతాడు. కానీ… రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పని చేయాల్సివస్తుంది. అక్కడా అరాకొర సంపాదనే. వరలక్ష్మి తన వంతు సాయంగా చెకోడీలు, మురుకులు వండి, షాపుల్లో అమ్ముతుంటుంది. ఆ డబ్బుల్నీ తన తాగుడుకు వాడేసుకొంటాడు లక్ష్మణ్. ఎప్పటికైనా ఓ పెద్ద పార్టీని పట్టి, లక్షల్లో, కోట్లలో కమీషన్ కొట్టేయాలన్నది లక్ష్మణ్ తాపత్రయం. ఆ వేటలో శ్వేత (రితిక శ్రీనివాస్) పరిచయం అవుతుంది. తను ఓ ఎన్.ఆర్.ఐ. భర్తపై అలిగి ఇండియాకు వచ్చేస్తుంది. ఇక్కడో విల్లా తీసుకోవాలనుకొంటుంది. తనని రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా కాకుండా, ఓ ఎంటర్ప్రైనర్గా పరిచయం చేసుకొంటాడు. మాటలతో ట్రాప్ చేస్తాడు. ఓ సమయంలో తన భార్యకు విడాకులు ఇచ్చి, శ్వేతని మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటాడు. ఈ విషయం వరలక్ష్మికి తెలుస్తుంది. అప్పుడు వరలక్ష్మి ఏం చేసింది? భర్తని ఎదిరించిందా? సర్దుకుపోయిందా? ఇవన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
కొన్ని కథలకు రిసెర్చ్ పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి మన చుట్టూ ఉన్న కథలు. నిత్యం మనం చూసే పాత్రలు. ఈ కథలోని లక్ష్మణ్, వరలక్ష్మి, శ్వేత పాత్రలు అలానే కనిపిస్తాయి. ఇది కొత్త కథ కాదు. మనం ఎప్పుడో ఒకప్పుడు చూసిన కథే. ఇదే పాయింట్ తో ఇది వరకు చాలా సినిమాలొచ్చాయి. దర్శకుడు ఇందులో చేసిందేమిటి అంటే.. తెలిసిన కథని అత్యంత సహజంగా చూపించడం. పాత్రలు, వాటి పరిచయం, బస్తీ వాతావరణం, అక్కడి స్నేహాలు, వైరాలూ అన్నీ ఎలాంటి ఆర్టిఫిషియల్ మేకప్పులూ లేకుండా తెరకెక్కించాడు. లక్ష్మణ్ పాత్రని అర్థం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. కానీ ఒక్కసారి కుదురుకున్నాక, ఫాలో అవుతాం. నేరేషన్ స్లోగా ఉండడం, ఒకే పాయింట్ చుట్టూ కథ నడవడం వల్ల కాస్త బోర్ కొడుతుంది. పైగా కథలో ఊహించని మలుపులేం ఉండవు. శ్వేత పాత్ర ఎంట్రీతో మళ్లీ చలనం వస్తుంది. ఇంట్రవెల్ కార్డు త్వరగా పడిపోయందా? అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అప్పటి వరకూ నడిచిన కథేం ఉండదు. పైగా ఇంట్రవెల్ దగ్గర తెలుగు సినిమా పడికట్టు సూత్రాలకు అనుగుణంగా ట్విస్టో, కాన్ఫ్లిక్టో వచ్చి పడిపోదు.
ఏదో ఓ క్షణంలో లక్ష్మణ్ పాత్ర మారుతుంది అనిపిస్తుంటుంది. అయితే ఆ పాత్రని చివరి వరకూ అలానే నడిపాడు దర్శకుడు. కొన్ని జీవితాలంతే. పుట్టుకతో వచ్చిన లక్ష్మణాలు పుడకలతో కానీ పోవు అనడానికి లక్ష్మణ్ పాత్ర నిదర్శనంగా నిలుస్తుంది. చివరి షాట్ వరకూ పాత్రని ఒకేలా నడపడం సినిమాటిక్ ప్రపంచానికి కాస్త దూరంగా వాస్తవికంగా అనిపించింది. ఈ కథలో వరలక్ష్మి పాత్రపైనే ఎక్కువ జాలి కలుగుతుంది. భర్త గాల్లో మేడలు కడుతుంటే, ఇంకా నేల మీదే కాపురం చేస్తున్న పాత్ర వరలక్ష్మిది. భార్యాభర్తల మధ్య సంఘర్షణ కంటే ఘర్షణే బాగా చూపించాడు దర్శకుడు. క్లైమాక్స్ లో లక్ష్మణ్ – వరలక్ష్మి పరస్పరం తలపడే సన్నివేశం ఒకటి ఉంది. దాన్ని చాలా సహజంగా హ్యాండిల్ చేశాడు. నిజంగానే ఇద్దరు కొట్టేసుకొంటున్నారా? అనే ఫీలింగ్ వస్తుంది. పక్కింట్లో భార్యాభర్తల గొడవని కిటికీలోంచి తొంగి చూస్తున్నట్టే అనిపిస్తుంది. శ్వేత పాత్రని అర్థాంతరంగా ముగించడం సరిగా అనిపించదు. ఆ పాత్రని క్లైమాక్స్ లో కూడా తీసుకొస్తే బాగుండేది.
వినోద్ కిషన్ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడే. కానీ హీరోగా తనని ఊహించడం కష్టం. ఈ సినిమాలో నెగిటీవ్ ఛాయలున్న పాత్ర కాబట్టి, వినోద్ కిషన్ ఎంపిక సరైనదే అనిపిస్తుంది. కానీ ఆ పాత్రలో మనకు బాగా తెలిసిన నటుడు ఉంటే ఇంకాస్త కనెక్ట్ అయ్యేవాళ్లం. వరలక్ష్మిగా అనూష కృష్ణ నటన బాగుంది. నిజానికి ఆమెను చూడగానే హీరోయిన్గా అనుకోలేం. కానీ సినిమా నడుస్తున్న కొద్దీ, ఈ కథకు నిజమైన హీరో తనే అనిపిస్తుంది. క్లైమాక్స్ లో తన నటన మరీ బాగుంది. శ్వేత పాత్ర ఉండేది కాసేపే. కానీ ఎన్.ఆర్.ఐకి తగ్గ బాడీ లాంగ్వేజ్ చూపించింది.
చిన్న సినిమా ఇది. బడ్జెట్ పరిమితులు ఉంటాయి. కానీ వాళ్లు బడ్జెట్ కు పరిపడా కథని ఎంచుకొన్నారనిపిస్తుంది. ఒక పాట ఉంది. అది కూడా కథానుసారం వచ్చేదే. నేపథ్య సంగీతంలో లక్ష్మణ్ అంటూ ఓ బిట్ వినిపిస్తుంది. అది బాగుంది. థియేటర్‌కి వెళ్లి చూడాల్సినంత కుతూహలం ఈ సినిమా ఇవ్వకపోవొచ్చు. స్టార్ కాస్టింగ్ లో ఆకర్షణ లేకపోవొవచ్చు. కానీ మధ్యతరగతి మందహాసాన్ని, ఆశకీ దూరాశకూ మధ్య ఊగిసలాడుతున్న జీవన చిత్రాన్నీ ఈ చిన్న కథలో చూపించగలిగారు.