నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో ‘దసరా’ వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. నాని నటించే 33వ సినిమా ఇది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రానికి రూ.80 నుంచి రూ.100 కోట్ల బడ్జెట్ అవ్వబోతోందని సమాచారం. నాని కెరీర్లో ఇదే ఖరీదైన సినిమా. ‘దసరా’కు దాదాపు రూ.60 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ సినిమా అంత రాబట్టగలిగింది కూడా. ఆ ధైర్యంతోనే ఇప్పుడు రూ.100 కోట్లు పెట్టడానికి రెడీ అవుతున్నారు.
Read Here : నాని, దర్శి.. ఓ కొత్త దర్శకుడు
నాని తన మార్కెట్ ని మెల్లమెల్లగా పెంచుకొంటున్నాడు. ‘అష్టాచమ్మ’ రెండు కోట్లలో పూర్తయ్యింది. ‘భలే భలే మగాడివోయ్’ నుంచి హీరోగా తన రేంజ్ పెరిగింది. ఆ తరవాత ప్రతీ సినిమాకూ బడ్జెట్ పెరుగుతూనే ఉంది. నాని పారితోషికం కూడా ఇప్పుడు రూ.20 నుంచి రూ.25 కోట్ల మధ్యలో ఉంది. తన సినిమా అంటే ఓటీటీ, శాటిలైట్ నుంచి మంచి రేట్లే వస్తాయి. అందుకే నిర్మాతలు కూడా నానిపై రిస్క్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. నాని నటిస్తున్న ‘సరిపోదా శనివారం’ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కమర్షియల్స్ ని బట్టి నాని – శ్రీకాంత్ ఓదెల సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ‘సరిపోదా శనివారం’ బాగా ఆడితే.. నిర్మాత రూ.100 కోట్లు పెట్టడానికి ఏమాత్రం ఆలోచించకపోవొచ్చు. లేదంటే రూ.80 కోట్లలోపే పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ చిత్రంలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు పరిశీలనలో ఉంది. జాన్వీ పారితోషికం ఇప్పుడు రూ.4 కోట్లకు అటూ ఇటుగా ఉంది. నానికి రూ.25 కోట్లు. ఇక్కడే లెక్క రూ.30 కోట్లకు చేరింది.