ఏదైనా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి దాన్ని గుడ్డిగా నడిపేవారి చేతుల్లో పెడితే దాని వల్ల నష్టం అసామాన్యంగా ఉంటుంది. బీఆర్ఎస్ ఇప్పుడా పరిస్థితిని ఫేస్ చేస్తోంది. సోషల్ మీడియా సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. దేశవిదేశాల్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. వారంతా పార్టీ కోసం పని చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు చేశారు.. ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఆ సోషల్ మీడయా సైనికులు పార్టీ కోసం కాకుండా పార్టీ పేరుతో వ్యక్తిగత యుద్ధాలను ఎజెండా చేసుకుని కొన్ని గ్రూపులను టార్గెట్ చేయడంతో మొదటికే మోసం వస్తోంది.
బీఆర్ఎస్ కు ప్రత్యర్థి ఎవరు ?. బీజేపీ, కాంగ్రెస్. ఈ రెండు పార్టీల్లో బీజేపీతో పొత్తు లేదా విలీనం కోసం ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే పల్లెత్తు మాట అలేరు. మరో ప్రత్యర్థి కాంగ్రెస్. గ్రౌండ్ లెవల్ లో బాగానే కష్టపడుతున్నారు కానీ సోషల్ మీడియాకు వచ్చే సరికి ఎజెండా మారిపోతోంది. టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని టార్గెట్ చేసుకుని వారి పేరుతో సెటిలర్స్ అని ఆంధ్ర మూలాలున్న వారిని బూతులు తిట్టడం ప్రారంభించారు. రాను రాను ఇది పెరిగిపోతోంది. గత ఎన్నికల ఫలితాలు చూసిన వాళ్లు ఎవరైనా .. బీఆర్ఎస్ ఇంత రాంగ్ స్టెప్ వేస్తోందేంటి అని అనుకోకుండా ఉండలేరు.
READ ALSO: వాళ్లపైనే ఆశలన్నీ పెట్టుకున్న బీఆర్ఎస్!
ఈ ఒక్క దాంట్లో కాదు.. ప్రతీ దాంట్లోనూ అదే పని. పూరి జగన్నాథ్ సినిమాలో ఏం జేద్దామంటావు మరి అనే హుక్ డైలాగ్ పాటలో వాడారని… అదేదో పెద్ద ఘోరమని.. ఆంధ్రోళ్లను తిడుతూ వీడియోలు చేశారు. ప్రతీ దానికి ఆంధ్రోళ్లంటూ మాట్లాడటం ప్రారంభించారు. ఏపీలో ఏమైనా జరిగినా… దానికి ముడిపెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల బీఆర్ఎస్ కు కలిగే లాభం ఏమిటని ఆలోచిస్తే.. ఏమీ ఉండదు కానీ.. నష్టం మాత్రం ఆ పార్టీకేనని క్లారిటీ వస్తుంది.
ఇప్పుడీ బీఆర్ఎస్ సోషల్ మీడియా సైన్యాన్ని ఎవరు నడుపుతున్నారో కానీ.. పార్టీ కంటే.. వ్యక్తిగత ఈగోలను శాటిస్ ఫై చేసుకోవడానికి ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ కు భారంగా సోషల్ మీడియా సైన్యం మారిపోయింది.