వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేటితో ఐదేళ్ళు నిండాయి. సరిగ్గా ఐదేళ్ళ క్రితం అంటే 2011 మార్చి 12న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా, ఆయన తల్లి విజయలక్షి గౌరవాధ్యక్షురాలిగా పార్టీని ఏర్పాటు చేసుకొన్నారు. అందుకు ఆయన చెప్పుకొన్న కారణం ఏదయినా, ముఖ్యమంత్రి అవ్వాలనే తన కలను సాకారం చేసుకోనేందుకేనని ఆయన మాటలు, చేతులు స్పష్టం చేస్తున్నాయి. అయితే అదేమీ నేరం కాదు కనుక ఆయనను అభిమానించే ప్రజలు వైకాపాని ఆదరించారు.
ఆయన చేపట్టిన ఓదార్పు యాత్రలు రాష్ట్రంలో వైకాపా బలపడేందుకు చాలా దోహదపడ్డాయి. ఆ భయంతోనే కాంగ్రెస్ అధిష్టానం అందుకు ఆయనకు అనుమతీయలేదని, అందుకే ఆయన పార్టీ వీడి స్వంత కుంపటి పెట్టుకొన్నారని దాని వలన స్పష్టం అయ్యింది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందినవారయినప్పటికీ, ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రదర్శించిన సందిగ్ధత వలన ఆ పార్టీయే ఎక్కువ నష్టపోగా, జగన్మోహన్ రెడ్డి ఆయన పేరును, ఆయన ప్రవేశ పెట్టిన పధకాలను తద్వారా ఆయనకున్న పాపులారిటీని స్వంతం చేసుకొని రాజకీయంగా మరింత బలపడగలిగారు.
ఆ కారణంగా రెండేళ్ళ వ్యవధిలోనే ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించేంతగా బలపడగలిగారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, అలాగే తెదేపా ఎమ్మెల్యేలను బయటకి రప్పించడంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. 2012లో జరిగిన ఉపఎన్నికలలో మొత్తం 18 అసెంబ్లీ సీట్లలో 15 సీట్లను, రెండు లోక్ సభ సీట్లను గెలుచుకొని వైకాపా తన సత్తా చాటుకొంది. కానీ అదే సంవత్సరం మే27న అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టయ్యి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. సుమారు 16నెలల జైలు జీవితం గడిపిన తరువాత మళ్ళీ 2013, సెప్టెంబర్ 24న బెయిల్ పొంది విడుదలయ్యారు.
అతని అరెస్ట్ కి కారణమయిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతోనే ఆయన రహస్య అవగాహన కుదుర్చుకొని జైలు నుండి బయటపడ్డారని వార్తలు వచ్చేయి. ఎందుకంటే రాష్ట్ర విభజన చేసిన కారణంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉన్నందున, ఆ వ్యతిరేకతను వైకాపాకి సానుకూలంగా మార్చుకోగలిగితే, ఎన్నికల తరువాత అతనితో చేతులు కలపాలని కాంగ్రెస్ అధిష్టానం భావించినట్లు ఆ పార్టీ నేతలే బయటపెట్టుకొన్నారు.
కనుక 2014 ఎన్నికలు వైకాపాకి ఒక అద్భుతమయిన అవకాశామని చెప్పవచ్చును. కాంగ్రెస్ పట్ల రాష్ట్ర ప్రజలలో నెలకొన్ని తీవ్ర వ్యతిరేకత ఉంది. పదేళ్ళుగా ప్రతిపక్షంలో కూర్చొన్న తెదేపా చాలా బలహీనంగా ఉండి ఎన్నికలను ఎదుర్కొంది. రాష్ట్రంలో మరే పార్టీకి బలం లేకపోవడం వలన రాజకీయ శూన్యత నెలకొని ఉంది. అటువంటి అవకాశాన్ని జగన్ స్వీయ తప్పిదాల కారణంగా, చంద్రబాబు నాయుడు అమలు చేసిన ఆద్భుత వ్యూహాల కారణంగా, తెదేపా-బీజేపీ కూటమికి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినందున వైకాపా ఎన్నికలలో ఓడిపోయింది. కానీ శాసనసభలో దాని బలం 67కి, లోక్ సభలో 9స్థానాలకు పెంచుకోగలిగింది.
ఆ తరువాత నుండి జగన్ తెదేపా ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రతీసారి ఆయన దుందుడుకుతనం వలన ఆయన స్వయంగా ఎదురుదెబ్బలు తినడమే కాకుండా పార్టీకి కూడా తీరని నష్టం కలుగుతోంది. పంటరుణాల మాఫీ, రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా వంటి అనేక సమస్యలపై ఆయన చాలా తీవ్రంగా పోరాడినప్పటికీ వాటిపై ఆయనకి పట్టుదల, చిత్తశుద్ది కొరవడంతో వైకాపా కూడా ఎదురుదెబ్బలు తినవలసి వచ్చింది.
ఇటీవల తెదేపా ప్రభుత్వాన్ని కూల్చుతానని నోరు జారినందుకు ఏకంగా 8 మంది ఎమ్మెల్యేలను కోల్పోవలసివచ్చింది. వైకాపాకి ప్రజలలో మంచి ఆదరణ ఉన్నపటికీ “జగన్ అంటే వైకాపా, వైకాపా అంటే జగన్ మాత్రమే’ అన్నట్లుగా ఆయన పార్టీని నడిపిస్తుండటం చేతనే తరచూ ఎదురు దెబ్బలు తినవలసివస్తోందని చెప్పక తప్పదు. కనుక ఆయన తనకు తోచినట్లు పార్టీకి శల్యసారద్యం చేయాలని ప్రయత్నించేబదులు పార్టీలో సీనియర్లతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకొంటూ పార్టీని నడిపించినట్లయితే వైకాపాకి మంచి భవిష్యత్ ఉంటుంది.