విశాఖ కార్పొరేషన్లో వైసీపీ దాదాపుగా ఖాళీ అయింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరారు. ఇప్పుడు మరికొంత మంది టీడీపీలో చేరారు. తాజాగా పదమూడు మంది వైసీపీ, ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ టీడీపీలో చేరారు. మరో పది మంది కార్పొరేటర్లు మంగళవారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశం ఉంది. ఇప్పుడు కార్పొరేషన్లో వైసీపీకి ఇరవై మంది కార్పొరేటర్ల మద్దతు కూడా లేదు.
మేయర్ ను రాజీనామా చేయాలని కార్పొరేటర్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం నాలుగేళ్ల వరకూ అవిశ్వాస తీర్మానం పెట్టకూడదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సవరించడానికి అవకాశం ఉంది. మెజార్టీ మున్సిపాల్టీల్లో వైసీపీ క్యాడర్ అంతా పక్క చూపులు చూస్తూండటంతో.. చట్టం మార్చి అవిశ్వాసాలను పూర్తి చేసి.. స్థానిక సంస్థల్లో టీడీపీ నేతలకు పదవులు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామన్న ప్రచారంతో విశాఖలో వైసీపీ నేతలు చేసిన దోపిడీకి ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఏ నియోజకవర్గంలోనూ వైసీపీకి కనీస ఓట్లు రాలేదు. 70 నుంచి 97 వేల ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం ఓట్లలో 70 శాతం వరకూ కూటమి అభ్యర్థికే పడ్డాయంటే వైసీపీని ప్రజలు ఎలా తిరస్కరించారో అర్థమవుతుంది. అందుకే తమ రాజకీయ భవిష్యత్ ను చూసుకుంటూ.. వైసీపీ కార్పొరేటర్లుఇతర పార్టీలకు వెళ్లిపోతున్నారు. వారు వెళ్లిపోతున్నా ఆపేందుకు కీలక నేతలు ప్రయత్నించడం లేదు.