అమెరికా అధ్యక్షపదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోటీ పడే డెమెక్రాటిక్ అభ్యర్థి మారిపోయారు. అారోగ్య కారణాలు, వృద్ధాప్యం కారణంగా జోసఫ్ బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ వైపు అందదరి చూపు పడింది. ఆమె అభ్యర్థిత్వాన్ని బైడెన్ సమర్థించాల్సి ఉంది. మరికొంత మంది నేతలు కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు.
ప్రైమరీల్లో డెమెక్రాటిక్ పార్టీ సభ్యుల నమ్మకాన్నిబైడెన్ చూరగొన్నారు. కానీ ఇటీవలి కాలంలో ఆయన పూర్తిగా తడబడుతున్నారు. ట్రంప్ తో జరిగిన మొదటి డిబేట్ లో ఫెయిలయ్యారు. అనారోగ్యంతో ఆయన ఏం చేస్తున్నారో ఆయనకే తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. ఎనభై ఏళ్లు దాటిపోయిన ఆయన పరిస్థితుల్ని సక్రమంగా డీల్ చేయలేకపోతున్నారని భావించారు. చివరికి డెమెక్రాటిక్ పార్టీ ముఖ్యులంతా ఆయన రేసు నుంచి వైదొలగాలని ఒత్తిడి చేశారు. ఓ సారి అభ్యర్థిత్వం ఖరారయ్యాక.. ఆయన స్వచ్చందంగా వదులుకుంటే తప్ప.. మరొకరికి అభ్యర్థిత్వం ఇవ్వలేరు. అది కూడా ఆయన మద్దతిచ్చిన వారికే లభిస్తుది.
ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఆ తర్వాత ట్రంప్ గ్రాఫ్ మరింతగా పెరిగింది. అదే సమయంలో బైడెన్ .. అమెరికాను నడపలేరని డెమోక్రటిక్ ప్రముఖులు కూడా విశ్లేషించడం ప్రారంభించారు. చివరికి బైడెన్ ఒత్తిడికి తలొగ్గక తప్పలేదు. అయితే ఆయన ఇప్పుడు కమలా హ్యారిస్ ను సపోర్టు చేస్తారా లేకపోతే మరెవరికైనా మద్దతిస్తారా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రేసులో కమలా హ్యారిసే ముందున్నారని చెబుతున్నారు. అమెరికాకు మహిళా ప్రెసిడెంట్ అనేది ఓ తీరని కలగా మారింది. ఈ సారి అలాంటి అవకాశం కనిపిస్తోంది.