కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఐటీ పరిశ్రమ, ఐటీ ఉద్యోగుల్ని ఇతర రాష్ట్రాలకు పంపించేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఐటీ పరిశ్రమల్లోనూ స్థానికులకే ఉద్యోగాలివ్వాలని చట్టం తెచ్చేందుకు నిర్ణయించింది. వ్యతిరేకత రావడంతో ముందుకెళ్లట్లేదని ప్రకటించింది. కానీ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులు రోజుకు పధ్నాలుగు గంటలు పని చేయాలని చట్టం తెచ్చేందుకు సిద్ధమవుతోంది.
Also Read :లోకేష్‌ను కలిసిన నాస్కాం టీం
ఉద్యోగులతో రోజుకు పధ్నాలుగు గంటలు పని చేయించుకునేలా చట్టాన్ని మార్చాలని కంపెనీలు కోరాయని దానికి ప్రభుత్వం అంగీకరించిందని బిల్లు తెచ్చేందుకు నిర్ణయించిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దీంతో ఒక్క సారిగా ఐటీ ఉద్యోగుల్లో గగ్గోలు రేగింది. ప్రభుత్వం దీన్ని సమర్థించుకుంటోంది. ప్రస్తుతం రోజుకు పది గంటల పని టైం… రెండు గంటల ఓవర్ టైం వర్కింగ్ అవర్స్ ఉన్నాయని.. దీన్ని మరో రెండు గంటలు పెంచుతున్నామని అంటోంది. అయితే అదనంగా పెంచిన పని గంటలకు ఎలాంటి భత్యం చెల్లించరు. ఉద్యోగుల్ని చట్ట ప్రకారం ఎక్కువగా పని చేయించుకోవడానికి అవకాశం ఇచ్చినట్లే.
ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డాయి. ఉద్యోగికి వ్యక్తిగత జీవితం లేకుండా చేకిరీ చేయించుకునే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఐటీ రంగంలో టార్గెట్ల పేరుతో.. అసలు సమయం కన్నా ఎక్కువే చేయించుకుంటున్నారని.. తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి . ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉండటంతో.. ఐటీ ఉద్యోగులు కూడా వేరే నగరాలకు వెళ్లిపోవడం మంచిదన్న నిర్ణయానికి వస్తారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఐటీ రంగాన్ని కర్ణాటక నుంచి వెళ్లగొట్టేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రపోదా అని ఇతర పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.