ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా సంస్థ చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నానో కార్ ప్రాజెక్టు స్థాపించేందుకు దేశంలో అనేక రాష్ట్రాలను పరిశీలించిన తరువాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలోని సింగూరుని ఎంపిక చేసుకొంది. అప్పుడు అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం టాటా సంస్థకు సుమారు 1000 ఎకరాలను ఇచ్చింది. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యవసాయ భూములలో ఆ కర్మాగారాన్ని నెలకొల్పాలనే టాటా ప్రయత్నాలను చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. భూములు కోల్పోయిన రైతులు, స్థానిక ప్రజలు, పర్యావరణ సంస్థల ప్రతినిధులు, రాష్ట్రంలోని మేధావులు ఆమెకు మద్దతు పలకడంతో నానో కార్ల కర్మాగారానికి బ్రేక్ పడింది.
నానో ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టాటా సంస్థ చైర్మన్ రతన్ టాటా ఎట్టి పరిస్థితులలో కూడా 2008 లోగా మొట్ట మొదటి నానో కారును విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఎవరూ ఊహించలేని నిర్ణయం తీసుకొన్నారు. సింగూరులో ఇంక నానో కార్ల తయారీ కేంద్రానికి అవరోధాలు ఎదురవుతున్నందున, దానిని తక్షణమే గుజరాత్ రాష్ట్రంలోని సనంద్ అనే ప్రాంతానికి తరలించాలని నిర్ణయించారు. వెంటనే తన నిర్ణయాన్ని అమలుచేసి చూపించి, 2009, మార్చి23న మొట్టమొదటి నానో కారుని మార్కెట్లోకి విడుదల చేసారు.
సింగూరులో నానో కార్ల తయారీ కేంద్రం కోసం సేకరించిన 1000 ఎకరాలపై నాటి నుండి నేటి వరకు కూడా న్యాయస్థానంలో కేసులు నడుస్తూనే ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న తన పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తూ దాని గురించి కూడా ఒక ఆసక్తికరమయిన ప్రతిపాదన చేసారు. సింగూరులో టాటా సంస్థ సేకరించిన 1000 ఎకరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి తమ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందని మమతా బెనర్జీ చెప్పారు. ప్రస్తుతం ఆ కేసు న్యాయస్థానంలో ఉంది కనుక ఇక దానిపై తామేమీ చేయలేమని చెప్పారు.
టాటా సంస్థ తన్న అధీనంలో ఉన్న 600ఎకరాలలో కార్ల తయారీ సంస్థను పెట్టుకొని, మిగిలిన 400 ఎకరాలను రైతులకు తిరిగి ఇచ్చేసేందుకు అంగీకరించే మాటయితే, తమ ప్రభుత్వం టాటా సంస్థకి సహకరిస్తుందని మమతా బెనర్జీ నిన్న ఒక రాజీ ప్రతిపాదన చేయడం విశేషం. ఆమె స్వయంగా నానో సంస్థని రాష్ట్రం నుండి బయటకు తరిమేసి, ఇప్పుడు మళ్ళీ ఆమే రాజీ ప్రతిపాదన చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు ఉద్యమిస్తూ రాజకీయ లబ్ది పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి కనుకనే ఆమె ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ రాజీ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.