అన్నీ అనుకొన్నట్టు జరిగితే… టాలీవుడ్ లో ఓ క్రేజీ కాంబో సెట్టయ్యేది. నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌లను ఒకే తెరపై చూసే అవకాశం దక్కేది. కానీ ఈ ఛాన్స్ తృటిలో మిస్సయ్యింది.
యేడాది క్రితం.. టాలీవుడ్ లోని ఓ ప్రముఖ నిర్మాత దగ్గరకు ఓ కథ వచ్చింది. ఆయన దాదాపు పెద్ద హీరోలందరితోనూ సినిమాలు చేశారు. బాలకృష్ణ మినహా. ఆయనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నాడు. అలాంటి అవకాశం చేతికి అందింది. అయితే అదో మల్టీస్టారర్ కథ. వినగానే ఆ నిర్మాతకు బాగా నచ్చేసింది. బాలయ్య, పవన్‌లకు పర్ఫెక్ట్ గా సెట్టవుతుందని భావించారు. ఆయన తనకు తెలిసిన రచయితలకు, దర్శకులకు ఈ కథ చెప్పించారు. వాళ్లకూ బాగా నచ్చింది. వెంటనే బాలయ్యతో ఓ మీటింగ్ సెట్ చేయించారు. ‘పవన్‌కూ మీకూ సరిపోయే ఓ కథ ఉంది.. వింటారా’ అంటూ. ఇండ్రస్ట్రీలో కాకలు తీరిన నిర్మాత చెబితే… కాదని ఎవరంటారు? పైగా అప్పటికి పవన్‌తో మంచి రాపో కుదిరింది. ‘అన్ స్టాపబుల్’ కూడా పవన్ వచ్చి ఉన్నాడు. అందుకే బాలయ్యకు అభ్యంతరం లేకుండా పోయింది. మీటింగ్ ఫిక్సయ్యింది. బాలయ్యకు కథ ఓకే అంటే.. ఆ తరవాత పవన్ దగ్గరకు వెళ్లాలి. కానీ.. అక్కడే ఆ నిర్మాత ‘కథ’ చెదిరింది. ఓ పెద్ద హీరో ఎదరుగా కూర్చుని కథ చెప్పడం ఆ దర్శకుడికి తొలిసారి. దాంతో కాస్త కన్ఫ్యూజ్ అయి… చెప్పాల్సిన కథని సరిగా చెప్పలేకపోయాడట. దాంతో బాలయ్య ‘ఇదేం కథ… నాకు నచ్చలేదు’ అంటూ మొహమాటం లేకుండా పక్కన పెట్టేశాడు. నిజానికి ఆ కథపై నిర్మాతతో పాటు అందరికీ మంచి గురి ఉంది. బాలయ్య – పవన్‌లకు తప్ప మరే హీరోలకూ సరిపోదు. ఇక్కడ చూస్తే తొలి అడుగులోనే భంగపాటు ఎదురైంది. బాలయ్య ఓకే అంటే.. అట్నుంచి అటు పవన్‌కు చెప్పి ఒప్పించేద్దురు. కానీ దర్శకుడు ఆ కథని సరిగా చెప్పలేకపోవడం వల్ల ఓ మంచి కాంబో చూసే అవకాశం చెదిరింది.
అయితే ఆ నిర్మాత మాత్రం ఇప్పటికీ తన ప్రయత్నాలు మానలేదు. ఆ కథ కాకపోయినా పవన్, బాలయ్యలకు సెట్ అయ్యే మరో కథ చెప్పమని రచయితల్ని అడుగుతూనే ఉన్నాడు. మరి… అలాంటి కథ మళ్లీ పుడుతుందో లేదో?