సోమవారం ప్రెస్ మీట్ పెట్టిన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల వైఎస్ జగన్ టార్గెట్ గా చాలా విమర్శలు చేశారు. ఆయనపై ఉన్న పాత అభియోగాలు.. బీజేపీతో అనుబంధం మొత్తాన్ని బయటకు తీసి విమర్శించారు. ఆయన పార్టీ కార్యకర్తలు చంపుకుంటే దానికే ఢిల్లీలో ధర్నా చేస్తారా అని ప్రశ్నించారు. వివేకా బాబాయ్ హత్య కేసులో ఎందుకు ధర్నాలు చేయలేదని ప్రశ్నలు గుప్పించారు.
ఎన్నికల ప్రచారంలో కన్నా షర్మిల ఎక్కువ తీవ్రతతో విమర్శలు చేశారు. ఇలా ఎందుకు అంటే…జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారని స్పష్టమైన సమాచారం ఉండటంతోనే ఇలా చేశారని అంటున్నారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. జైరాం రమేష్ ప్రత్యేకంగా వైసీపీకి సపోర్టుగా మాట్లాడుతున్నారు. ఢిల్లీ ధర్నాలో కలసి వచ్చే పార్టీలను కలుపుకుంటామని జగన్ చెబుతున్నారు. ఆ కలసి వచ్చే పార్టీలు ఖచ్చితంగా కాంగ్రెస్ దాని మిత్రపక్షాలే కావొచ్చని షర్మిల అనుమానిస్తున్నారు.
Also Read : షర్మిలను విమర్శిస్తే ఇక అంతే సంగతులు!
జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఫోల్డ్ లోకి వస్తే ఎక్కువగా నష్టపోయేది షర్మిలనే. ఆమె రాజకీయ భవిష్యత్ డొలాయమానంలో పడుతుంది. కాంగ్రెస్ హైకమాండ్ జగన్ కే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే షర్మిల అసహనంతో ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వైసీపీపై ఏ మాత్రం సానుభూతి చూపినా ఆయనపై అసంతృప్తితో ఉన్న మైనార్టీ, దళిత ఓటు బ్యాంక్… కాంగ్రెస్ కు తిరిగి రావడం కష్టమని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు గట్టి సంకేతాలు పంపేలా ఢిల్లీ ధర్నాకు ముందు ఘాటైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.