వైకాపా వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజా తమ పార్టీ కార్యకర్తలకిచ్చిన సందేశం చాలా ఆసక్తికరంగా ఉంది. “మన పార్టీలో నుండి ఓ గుప్పెడు మంది ఎమ్మెల్యేలని తెదేపాలోకి తరలించుకుపోయినంత మాత్రాన్న వైకాపా తుడిచిపెట్టుకొని పోతుందనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు. నిజానికి తెదేపాలోకి వెళ్ళిపోయినా ఆ ఎమ్మెల్యేలు వారు స్వంత బలంతో నెగ్గలేదు. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి చేసిన మంచిపనుల వలన, ఆయన కుమారుడు జగనన్న, వైకాపా టికెట్ తో పోటీ చేయడం వలననే నెగ్గారు. అటువంటి వాళ్ళు మళ్ళీ పోటీ చేసినా నెగ్గలేరు. అందుకే తెదేపా వారిపై వేటు వేసి ఉపఎన్నికలకి వెళ్లేందుకు భయపడుతోంది.”
“మన పార్టీ నీతికి, నిజాయితీకి కట్టుబడి ఉంది కనుకనే చంద్రబాబు నాయుడులాగ ఎన్నికలలో తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించలేదు. మనం కూడా ఒక మెట్టు దిగేందుకు సిద్దపడి ఉంటే నేడు మనమే అధికారంలో ఉండేవాళ్ళమని అందరికీ తెలుసు. మన ఎమ్మెల్యేలని తెదేపా తరలించుకుపోతోందని, మనల్ని వేధింపులకి గురి చేస్తోందని పార్టీ కార్యకర్తలు దిగులు చెందవలసిన అవసరం లేదు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మళ్ళీ మోసం చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ఇప్పటికే ప్రజలలో చాలా వ్యతిరేకత పెరిగిపోయింది. మనం ప్రజల తరపున నిలబడి నిజాయితీగా పోరాడుతుంటే చాలు. ప్రజలే మన నిజాయితీని గుర్తిస్తారు,” అని అన్నారు.
రోజా చెప్పిన ప్రకారం తెదేపాలోకి వెళ్ళిన వారు స్వంత బలంతో కాక స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, వైకాపా జెండా కారణంగానే గెలిచినట్లయితే, ఆమెతో సహా పార్టీలో ఎమ్మెల్యే, ఎంపిలందరికీ కూడా అదే నియమం వర్తిస్తుంది. ఆమె చెప్పిన మాటలలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, స్వతహాగ అంగబలం, అర్ధబలం లేని వాళ్ళు ఏ పార్టీలోను రాజకీయాలలో రాణించలేరనేది బహిరంగ రహస్యం. ఎన్నికలకు ముందు టికెట్స్ కేటాయింపులని చూస్తే అది కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. కనుక తెదేపాలోకి వెళ్లిపోయినవాళ్ళందరూ దద్దమ్మలు కారు వైకాపాలో మిగిలిపోయిన వాళ్ళు అందరూ నిజాయితీపరులు కారు.
ఒకప్పుడు రోజా కూడా తెదేపాలో నుండి వైకాపాలోకి మారారు. అప్పుడు తెదేపా నేతలు కూడా ఆమె గురించి ఇలాగే మాట్లాడారని మరిచిపోకూడదు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారితే, పార్టీల బలాబలాలు మారుతాయి కనుక అప్పుడు తెదేపాలో వాళ్ళు వైకాపాలోకి మారవచ్చును లేదా వైకాపాలో వాళ్ళు తెదేపాలోకి మారవచ్చును. రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ని కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతారు తప్ప రాష్ట్రాభివృద్ధి కోసమో, సిద్దాంతాల కోసమో కాదని అందరికీ తెలుసు.